ష‌ర్మిల కాన్ఫిడెంట్ హిస్ట‌రీ క్రియేట్ చేస్తుందా!

రాజ‌కీయంగా త‌న‌కంటూ ఇమేజ్ సృష్టించుకున్న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వార‌సురాలు ష‌ర్మిల‌. నిన్న‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ అన్న వెనుక ఒక నాయ‌కురాలు. ఆమె భాష‌లో చెప్పాలంటే జ‌గ‌న్ అన్న వ‌ద‌లిన బాణం. కానీ ఇప్పుడు ష‌ర్మిల మారారు. దీనికి కార‌ణం ఏమిట‌నే దానిపై ప‌లు ఊహాగానాలున్నాయి. వ‌దిన భార‌తితో వ‌చ్చిన విబేధాలనీ.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ష‌ర్మిలకు ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే అక్రోశ‌మో. ఏమైనా ష‌ర్మిల తెలంగాణ కోడలినంటూ రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. వైఎస్ రాజ‌న్న రాజ్యం కోసం తానే ఒక పార్టీ పెడ‌తానంటూ ష‌ర్మిల ప్ర‌తిన‌బూనారు. తెలంగాణ ఉద్య‌మం అంత తీవ్ర ద‌శ‌కు రావ‌టం వెనుక చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వైఖ‌రే కీల‌క‌మ‌నే ఊహాగానాలుండేవి. అంత‌టి వ్య‌తిరేక‌త ఉన్న తెలంగాణ‌లో ఏకంగా సీఎం కావాల‌నే ల‌క్ష్యం మాత్ర‌మే కాదు… రాబోయే ఎన్నిక‌ల్లో తానే సీఎం అంటూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. విప‌క్షాల‌న్నీ కేసీఆర్‌ను గ‌ట్టిగా విమ‌ర్శించేందుకు వెనుకాడుతున్న స‌మ‌యంలో ష‌ర్మిల కేసీఆర్ ఛాతీలో గుండె లేదంటూ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌న్న‌రాజ్యం త‌న వ‌ల్ల‌నే సాధ్య‌మంటూ ధీమాగా చెప్పారు. అంతేనా.. కేసీఆర్ వ్య‌తిరేక వ‌ర్గాన్ని ఒక‌చోటికి చేర్చే ప‌ని కూడా మొద‌లుపెట్టారు. కేవ‌లం అన్న వెనుక నిల‌బ‌డి చెప్పిన‌ట్టు న‌డ‌చిన చెల్లెల‌కు ఇంత‌టి రాజ‌కీయ ప‌రిణితి.. వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ప‌న్న‌గ‌ల స‌త్తా ఎలా వ‌చ్చింద‌నేది ఇప్ప‌టికీ ఊహ‌కు అంద‌ని ప్ర‌శ్న‌గానే మిగిలింది. కానీ.. ష‌ర్మిల వెనుక ఏదో శ‌క్తి ఉంద‌నేది మాత్రం అర్ధ‌మ‌వుతోంది. అన్నింటినీ మించి తెలంగాణ‌లో నెల‌కొన్న రాజ‌కీయ‌శూన్య‌త‌ను భ‌ర్తీ చేసేందుకు బీజేపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న స‌మ‌యంలో ష‌ర్మిల కొత్త‌పార్టీతో స‌రికొత్త ఎజెండాతో రావ‌టం వెనుక పెద్ద వ్యూహమేదో ఉంద‌నేది మాత్రం వాస్త‌వం. అదే ఏమిటీ.. ఎవ‌రున్నారు.. అనేది తెలియాలంటే కొద్దికాలం ఓపిక‌ప‌ట్టాల్సిందే. అన్న‌ప‌ట్ల వ్య‌తిరేకంగా ఉన్న చెల్లి.. చెల్లెలు ప‌ట్ల వేచిచూసే ధోర‌ణిలో ఉన్న అన్న‌.. ఇలా క‌న్న‌బిడ్డ‌ల రాజ‌కీయ వైరం ఎంత వ‌ర‌కూ దారితీస్తుంద‌ని కంగారుప‌డే అమ్మ విజ‌య‌మ్మ‌.. అన్నాచెల్లెళ్ల‌ను ఏ విధంగా స‌మ‌న్వ‌యం చేస్తారు. ఇద్ద‌రి మ‌ధ్య వైరం పెర‌గ‌కుండా ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here