తిరుపతి ఉప ఎన్నిక. ఏపీలో అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. ఇక్కడ గెలిచి తీరాలని బీజేపీ, టీడీపీ పంతం పట్టాయి. సానుభూతి, వైసీపీ అభివృద్ది పనులకు ఇక్కడి గెలుపు రిఫరెండంగా వైసీపీ అంచనా వేసుకుంటోంది. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాభవాన్ని తిరుపతి ఎంపీ సీటు దక్కించుకోవటం ద్వారా అధిగమించాలనేది జనసేన ఎత్తుగడ. ఇలా నాలుగు పార్టీలు తిరుపతి ఉప ఎన్నికపై సీరియస్‌గా ఆలోచిస్తున్నాయి. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో వచ్చే జనవరి లోపుగా ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే.. ముందుగానే మేల్కొన్నటీడీపీ పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసింది. స్వయంగా అధినేత చంద్రబాబు పేరు ప్రకటించారు. దీంతో వైసీపీ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బల్లి కుటుంబం నుంచి ఎవరికి టికెట్ ఇవ్వకుండా ఫిజియోథెరపిస్టు.. జగన్‌కు కీలకమైన వ్యక్తి గురుమూర్తి పేరు ప్రకటించారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడుకు ఈ సారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటూ మంత్రి బొత్స ప్రకటించారు. దీంతో ఆ కుటుంబం నుంచి కూడా ఎటువంటి వ్యతిరేకత రాదనే అంచనాకు వచ్చారు.
ఇప్పుడు మిగిలింది.. బీజేపీ, జనసేన. ఏపీలో ఎలాగూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది. తిరుపతిలో బలిజ ఓట్లు చాలా కీలకం. యాదవ్‌లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తారు. కాబట్టి.. ఇక్కడ బీజేపీ, జనసేన రెండూ బరిలో తలపడాలని భావిస్తున్నాయి. పవన్ ఢిల్లీ పర్యటన వెనుక స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక గురించి చర్చించాలనే ప్రణాళిక కూడా ఉందని తెలుస్తోంది. నడ్డా, అమిత్‌షాలతో పవన్ తిరుపతి పై మాట్లాడవచ్చని తెలుస్తోంది. అమరావతి, పోలవరం అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వచ్చిన అభ్యర్థనతో జనసేన తమ అభ్యర్థులను పోటీ నుంచి విత్ డ్రా చేయించారు. దీనికి ప్రతిగా తిరుపతి తమకు ఇస్తారా! అనేది కూడా జనసైనికుల అనుమానం. కానీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తిరుపతి తమదేనంటున్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తమకు కలసి వస్తుందంటున్నారు. పైగా ఇక్కడ బీజేపీకు గట్టి కేడర్ కూడా ఉండటం మరింత కలసి వస్తుందంటున్నారు. జనసేన మాత్రం.. గతంలో ఇక్కడ పీఆర్ పీ నుంచి చిరంజీవి గెలవటాన్ని ప్రస్తావిస్తుంది. కాబట్టి ఎటు చూసినా జనసేన, బీజేపీ ఎవ్వరూ మెట్టు దిగేలా కనిపించట్లేదు. ఈ సస్పెన్స్ తీరాలంటే ఢిల్లీ వెళ్లిన పవన్ నోరు విప్పాల్సిందే.