తిరుపతి ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ గెలిచి తీరాలని భావిస్తుంటే.. టీడీపీ పరవు నిలుపు కోవాలని చూస్తుంది. ఎలాగైనా బీజేపీ విజయం సాధించాల్సిన ఎన్నికలుగా కమల శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఏపీలో రాజకీయ పరిస్థితులు తారుమారు కావటంతో అన్ని పార్టీలు ఎన్నికపై దృష్టిపెట్టాయి. గతానికి భిన్నంగా.. ఎవరైనా పదవిలో ఉండి మరణిస్తే.. ఆ కుటుంబానికే సీటు ఇవ్వటం ఆనవాయితీ. పలుసార్లు.. ఉప ఎన్నికల బరిలో పోటీకు ప్రతిపక్షాలు కూడా దూరంగా జరుగుతుంటాయి. కానీ.. ఈ సారి ఈ రాజకీయ సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు. ప్రధాన పార్టీలన్నీ రెఢీ అంటున్నాయి. పోటీలో తలపడి గెలిచి తీరాలని ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ, జనసేన పొత్తుతో ఎవరికి సీటు కేటాయిస్తారనేదానిపై ఊహాగానాలు నెలకొన్న సమయంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ అభ్యర్థే పోటీలో ఉంటారంటూ సెగలేపారు.
ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి తమ పార్టీ తరపున గత ఎన్నికల్లో ఓడిన పనబాక లక్ష్మి బరిలో ఉంటారని ప్రకటించారు. హస్తం పార్టీ నోరు మెదపటం లేదు. వైసీపీ తరపున బల్లి కుటుంబం నుంచి కొడుకును దింపుతారని భావించినా.. చివరిగా జగన్‌కు పాదయాత్రలో ఫిజియోథెరపిస్టుగా పనిచేసిన డాక్టర్ గురుమూర్తి పేరు తెరమీదకు తెచ్చారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. ఇక్కడ జనసేన పోటీ చేయాలని పంతం పట్టింది. కానీ.. బీజేపీ కూడా ఇప్పటికే తమ ఎత్తుగడలు ప్రారంభించింది. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగి మోదీ అనుకూల ప్రచారం ముమ్మరం చేస్తున్నారట. బీజేపీ వ్యూహకర్తల్లో ఒకరైన సునీల్ జయదేవకర్ స్వయంగా తిరుపతిలో పాగా వేశారు. ఇల్లు తీసుకుని ఉంటున్నారు. వారణాసిలో నరేంద్రమోదీ తరపున ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ జయదేవ్‌కర్ తిరుపతిలో ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది తెలియాలి. అయితే.. ఇటీవల పవన్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించటం వెనుక కారణం ఉప ఎన్నికే కారణమంటూ గుసగుసలూ లేకపోలేదు. ఇటీవల పవన్ ఢిల్లీ వెళ్లినపుడు కూడా ఇదే విషయం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువ ప్రభావం చూపే తిరుపతిలో జనసేన తేలికగా గెలుస్తుందనే భావన లేకపోలేదు. మరి బీజేపీ, జనసేన మధ్య పొత్తు తిరుపతిలో ఉంటుందా.. లేదా అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నమాట.