కరవమంటే కప్పకు.. వదలమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉందట.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలుపు వరకూ వచ్చిన అవకాశాన్ని వర్గపోరు పుణ్యం కట్టుకుంది. రాష్ట్రంలో కోలుకోకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు దెబ్బేసింది. అసలే గ్రూపులు.. ఎవరికి వారే నాయకులు. పేరుకే పీసీసీ అధినేత ఉంటారు కానీ.. ఎవ్వరూ ఆయన మాట లెక్కచేయరు. తమకు తామే సీనియర్లమంటూ జబ్బలు చరచుకుంటారు. కాదంటే.. అలుగుతారు.. అవసరమైతే గాంధీభవన్ ఎదురుగానే ధర్నా చేస్తారు. మా పరువు మేమే తీసుకుంటాం.. మా కళ్లు మేమే పొడచుకుంటాం.. మా నాయకులను మేమే ఓడించుకుంటామంటూ పాపం కాంగ్రెస్ నాయకులే అన్నీ చేసుకుంటారు. తమను దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా వాళ్ల ఓటమి వాళ్లే తెచ్చుకుంటారన్నమాట. ఇప్పుడు పీసీసీ అధ్య క్ష పదవి ఎవరికి ఇద్దామనే దానిపై హైకమాండ్ ఒకరిద్దరు పేర్లు ప్రస్తావిస్తే.. సీనియర్ల మంటూ వీహెచ్, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నాల, భట్టి వంటి వారు ఢిల్లీ చేరారు. మమ్మల్ని కాదని.. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం ఇస్తే మేం పార్టీకు రాజీనామా చేస్తామంటూ బెదిరించినంత పనిచేశారు. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మా మాటకు విలువ లేదంటూ కూనిరాగాలు తీస్తున్నారాయె. ఇంతగా కోట్లాటలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ను కాపాడేదెట్టా అంటూ.. సోనియమ్మ.. రాహులయ్య కూడా తెగ గుబులు పడుతున్నారట.