భారత్‌కు సునామీ ముప్పు పొంచి ఉందా! బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు దేనికి సంకేతాలు. రాజమండ్రి గోదావరి తీరంలో కనిపిస్తున్న మార్పులు సునామీకు సంకేతాలా! ఇదే ఇప్పుడు సముద్ర, నదీతీర ప్రాంతాల్లోని ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్న అంశం. ఇటీవల గోదావరి నదిలో గలగలా పారే స్వచ్ఛమైన నీటి మధ్యలో ఏదో మార్పు.. రంగుమారిన నీరు కిలోమీటర్ల పొడవునా కనిపించింది. ఇదంతా కాలుష్యం అనుకుందామంటే ఎప్పుడూ అలా కనిపించలేదు. దీనికి మరింత బలాన్నిచ్చేలా మరోవైపు లక్షలాది తూనీగలు కనిపించాయి. వాస్తవానికి తూనీగలు చక్కర్లు కొడుతున్నాయంటేనే వాతావరణంలో మార్పులు వచ్చినట్టు సంకేతం. పైగా అంత భారీగా ఒకేసారి తూనీగల గుంపు చూడగానే కలవరం. వ్యాపార, ఆహార పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడిన పెట్టిన రైతుల ఆశలన్నీ వాటిమీదనే ఉంటాయి. ఇటువంటి సమయంలో అనుకోని అవాంతరంగా వాతావరణ మార్పులు కోస్తాతీరంలో ముఖ్యంగా గోదావరి ప్రజలను కలవరపాటుకు గురిచేస్తుంది. ఇదిలా ఉంటే.. మరో వైపు కన్యాకుమారి తీరంలో రెండ్రోజులుగా సముద్రం వెనక్కి వెళ్లిపోతుంది. వివేకానందుడి విగ్రహం వద్ద రాళ్లు కూడా బయటకు కనిపిస్తున్నాయట. హిందూమహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం మూడు కలయికగా త్రివేణి సంగమంలో వస్తున్న మార్పులు.. భవిష్యత్‌లో సంభవించబోయే ప్రకృతి వైపరీత్యాలకు.. ప్రళయాలకు సంకేతాలు కావచ్చనే ఆందోళన నెలకొంది.



