రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. కృష్ణాజిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఇదే మాదిరిగా కనిపిస్తుంటాయ. అక్కడ ఎవరు ప్రత్యర్థులు.. మరెవరు మిత్రులు అని కనిపెట్టడం ప్రతిరోజూ సవాల్‌గానే ఉంటుంది. అటువంటి జిల్లాగడ్డమీద వరుసగా గెలుపు వరించినా అదృష్టం ఎందుకో గేటు దాటిరానట్టుగా మారింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి. వంశీ స్వతహాగా దూకుడు స్వభావం ఉన్న నేత. సినీ, రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు కూడా. కమ్మ సామాజికవర్గంలోనూ అతడికి మంచి పట్టుంది. 2019 ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై కేవలం 838 ఓట్ల తేడాతో గెలిచాడు. గన్నవరం అసెంబ్లీ నియోకవర్గంలో ఇప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ గెలుపు సాధించింది. పుచ్చలంపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం, దాసరి బాలవర్దనరావు , గద్దె రామ్మోహన్ వంటి రాజకీయ ఉద్దండులను నెత్తిన పెట్టుకున్న గన్నవరం.. వంశీను కూడా వరుసగా రెండుసార్లు ఆశీర్వదించింది. వైసీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు 2019లో బలంగా మలచుకుని గట్టెక్కారు వంశీ. ఇంత లక్ ఉన్నా ఎప్పుడూ అంతర్గత శత్రువులతో పోరాటం చేయాల్సి వస్తోంది. 2014లో టీడీపీ అధికారం చేపట్టినా వంశీను ప్రత్యర్థిగానే చూశారనే గుసగుసలూ లేకపోలేదు.
గన్నవరం రాజధాని పరిధిలోకి వచ్చినా.. ఆయనకు మాత్రం అనుకున్నంత ఇమేజ్ రాకుండా సొంతగూటి వాళ్లే అడ్డుకట్ట వేశారట. ప్రజలకు తన నియోజకవర్గంలో ఇవ్వాల్సిన పక్కాఇళ్ల కోసం పెద్ద యుద్ధమే చేశారు వంశీ. కానీ.. దేవినేని ఉమా నుంచి వంశీకు గట్టి వ్యతిరేకత ఎదురైంది. చంద్రబాబుతో ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న విబేధాలను బూచిగా చూపుతూ వంశీను వెనక్కినెట్టించారట. హరికృష్ణ మరణానికి ముందు వరకూ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో నారా కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. కానీ జూనియర్ ఎన్టీఆర్‌కు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు మంచి మిత్రులు.. సినీ పరంగా జూనియర్ ఎదుగుదలకు ఆ ఇద్దరూ సాయం అందించారు. దీన్ని దేవినేని భూతద్ధంలోచూపుతూ వంశీను చంద్రబాబుకు దూరం చేశారనే ఆరోపణలూ లేకపోలేదు. ఐదేళ్లపాటు అక్కడ చవిచూసిన ఇబ్బందులతో ఇటీవలే వైసీపీ వైపు అడుగులు వేశారు వంశీ.
ఇక్కడా అదే వ్యతిరేకత.. నిన్నటి వరకూ గన్నవరంలో చక్రం తిప్పిన దుట్టా, యార్లగడ్డలకు వంశీ వైసీపీలోకి రావటాన్ని తట్టుకోలేకపోయారు. ప్రత్యర్థిగా ఐదేళ్లపాటు వంశీను చూసిన ఆ ఇద్దరూ మిత్రుడుగా చేతులు కలిపేందుకు విముఖత వెలిబుచ్చారు. కానీ జగన్ ఆదేశాలను కాదనలేక మౌనంగా ఉండిపోయారు. కానీ నియోజకవర్గంలో వంశీ పెత్తనం పెరగటంతో ముగ్గురూ మూడ కూటములుగా మారారు. ఎవరి అనుచరులు వారిపైపునకు చేరటంతో గొడవలు మొదలయ్యాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లోనూ వంశీకు ఆ ఇద్దరి నుంచి ఎదురుగాలి మొదలైంది. ఇది కాస్తా మీడియాలోకి ఎక్కటంతో వంశీ తీవ్ర ఆవేశానికి గురైనట్టు సమాచారం. తాను అందరినీ కలుపుకుని వెళ్దామనుకున్నా.. తనను శత్రువుగానే చూడటం పట్ల కూడా మనోవేదన చెందుతున్నారట. ఎందుకో కాలం కలసిరావట్లేదంటూ తన వారి వద్ద వల్లభనేని చెప్పారట. మరి మున్ముందు పరిస్థితులు చక్కబడి వంశీను గట్టెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారట. జగన్ కూడా మూడుముక్కలాటకు అడ్డుకట్ట వేసేందుకు కొడాలిని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది.