జై ఆంధ్ర… విశాఖ ఉక్కు … ఉద్యమంలో కీలక నేత… 1980లో ఆయనొక సంచలనం. ఏపీ రాజకీయాల్లో వీరవసంతగా పేరు ప్రఖ్యాతులు. ఇదీ వసంత నాగేశ్వరావు చరిష్మా. నందిగామ నియోజకవర్గంలో అప్పట్లో వసంత నాగేశ్వరావు, ముక్కపాటి వెంకటేశ్వరావు ఇద్దరే నేతలు. ఎమ్మెల్యేలు. ఒకసారి వసంత ఓడితే.. మరోసారి ముక్కపాటి ఓడిపోయేవారు. అంతటి నేత క్రమంగా తెరమరుగవుతూ వచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ హవాలో కూడా కేవలం మాజీ మంత్రిగానే మిగిలారు. 2000 తరువాత రాజకీయంగా పోటీ చేసినా వరుస ఓటములు తప్పలేదు. హోంమంత్రిగా పనిచేసినా ప్రతి పల్లెలోని కాంగ్రెస్ కార్యకర్తను పేరు పెట్టి పిలువగల వ్యక్తి వసంత. దేవినేని వెంకటరమణ చేతిలో ఓటమి చూశాక… పంతం పెరిగింది. ఎలాగైనా దేవినేనిపై గెలవాలనే లక్ష్యంతో రాజకీయం చేశారు. తనయుడు వసంత కృష్ణప్రసాద్ ఉరఫ్ కేపీ ను రంగంలోకి దింపినా.. మూడుసార్లు వరుస పరాజయాలు తప్పలేదు. 2014 ఎన్నికల తరువాత వసంత అదే దేవినేని ఉమా సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కానీ ఎందుకో ఎక్కువకాలం నిలువలేకపోయారు. అనంతరం 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి చేరారు. పట్టుబట్టి దేవినేని ఉమా నియోజకవర్గం మైలవరంలో పోటీకు నిలిచారు. తెర ముందు కేపీ ఉన్నా.. వెనుక వసంత నాగేశ్వరరావు రాజకీయం నడిపారనే పేరుంది.. అలా ఎట్టకేలకు ఉమాకు తొలిసారి ఓటమి రుచిచూపారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక వసంత మరింత రాజకీయం చేశారు. జిల్లాలో ప్రాభవం కోసం తన వర్గాన్ని కలుపుకున్నారు. దేవినేనిపై పై చేయి సాధించేందుకు మైలవరంలోనే ఉంటూ కేపీ చక్రం తిప్పుతున్నారు. టీడీపీలో అసంతృప్త నేతలను వైసీపీ లోకి ఆహ్వానం పలుకుతూ వచ్చారు. మైనింగ్‌తో కోట్లు కూడబెట్టే అవకాశం ఉన్న మార్గాలను మూసివేశారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం తదితర ప్రాంతాల్లో మైనింగ్‌లో దేవినేని చేసిన అక్రమాలను వెలికితీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమాను ఉచ్చులో చిక్కేలా చేశారు. పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండేందుకు కారణమయ్యారు. దీంతో రెండున్నర దశాబ్దాల పంతం నెరవేర్చుకున్న వసంత.. వీరవసంతగా నిలిచాడంటున్నారు ఆయన అనుచరులు. అభిమానులు.