ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సమావేశంలో ఏం జరిగింది? ఏ అంశాల గురించి చర్చించారు? అవన్నీ రాజకీయ అంశాలా! వ్యక్తిగతమా అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ మీడియా సాక్షి బేటీఫలప్రదం అని రాసింది. ఈనాడు కూడా ఆచితూచి స్పందించింది. అంతర్గతంగా ఏయే అంశాలు చర్చించారనేది బయటకు చెప్పలేదంటూ చెప్పింది. కేవలం వైసీపీ అధికార ట్వీట్టర్ ద్వారా ఇచ్చిన ఫొటోను ప్రకటించింది. ఆంధ్రజ్యోతి మాత్రం.. కోర్టులపై కంప్లైంట్ అంటూ కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చింది. 40-45 నిమిషాల పాటు సాగిన బేటీలో ఏం జరిగింది. అసలేం మాట్లాడారు. మోదీ నిజంగానే జగన్ పట్ల కోపంగా ఉన్నారా. జగనే ఏపీలో బీజేపీ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారా! అనేది తెలియాలంటే సీఎం, పీఎం లేకపోతే.. విజయసాయిరెడ్డి ఎవరో ఒకరు చెప్పాల్సిందే. అంత వరకూ అక్కడేం జరిగినా సీఎంఓ, పీఎంఓ కార్యాలయాలు రిపోర్టు చేయవు. అవన్నీ సహజమైన బేటీలే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలయికగా నడిచే భారతదేశంలో ఇవన్నీ సర్వసాధారణం. గతంలో చంద్రబాబు, వైఎస్సార్ వంటి సీఎంలుగా పనిచేసినవారు కూడా పీఎంలన కలిశారు. కానీ.. ఆ నాడు లేని చర్చకు ఇప్పుడు మీడియా భూతద్దంలో చూపే ప్రయత్నం చేయటం విడ్డూరంగా అనిపిస్తుంది
వాస్తవానికి ఏపీ ప్రత్యేకహోదా అంశం మరుగున పడిపోయింది. కేంద్రంలోని ఎన్ డీఏ సర్కారు కూడా ప్రత్యేకహోదా ముగిసిన అంశంగా కొట్టేసింది. కావాలంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలంటూ సూచించింది. కానీ.. ఆ నాడు చంద్రబాబు కూడా రెండుకళ్ల సిద్ధాంతం మాదిరిగానే.. ప్యాకేజీ, హోదాల్లో ఏది ఉత్తమం అనేది చెప్పకుండానే ఉద్యమం చేసి నరేంద్రమోదీను తిట్టిపోశారు. అవన్నీ గతం ఇప్పుడు జగన్ ఏలుబడిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా గొడవలకు దిగుతున్నారు. మతం ముసుగులో కూడా కొన్ని ఘటనలు శాంతిభద్రతలకు విఘాతంగా మారాయి. ఇవన్నీ ఎవరో కావాలని కుట్రపూర్వకంగా చేస్తున్నారనేది కూడా ఆంధ్రప్రజలకు అర్ధమైంది. బీజేపీ కూడా కొద్దిరోజులుగా మౌనంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే జగన్, మోదీ బేటీ ఆసక్తికరంగా మారింది. దీన్ని ఎవరికి వారే తమదైన కోణంలో విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరనేది.. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను చూస్తే అర్ధమవుతుంది. కాబట్టి.. ఇప్పుడు బీజేపీకు వైసీపీ శత్రుత్వం లేదు. అంతమాత్రాన మైత్రి కూడా కనిపించదు. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. కేంద్రంలో ఎన్ డీఏ తెచ్చే చట్టాలు, బిల్లులకు వైసీపీ మద్దతు పలుకటం ద్వారా తాము మోదీ ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్నామనే సంకేతం పంపుతుంది. అటువంటి జగన్‌ను ప్రధాని ఎందుకు కోపగించుకుంటారు. అదే సమయంలో జగన్ మోహన్‌రెడ్డి ఒక సీఎంగా తన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించటంలో తప్పేముంది అనేది వైసీపీ శ్రేణులు అభిప్రాయం.
నరేంద్రమోదీకు జగన్ ఏపీలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు. కరోనా వల్ల తలెత్తిన ఆర్ధిక స్థితిగతుల గురించి చెప్పి ఉండవచ్చు. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వివిధ రూపాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించనూ వచ్చు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల చర్చ కూడా వచ్చి ఉండవచ్చేమో. ఏమైనా.. ఆ ఇద్దరూ ఏం మాట్లాడారనేది వైసీపీ అనుకూల మీడియా సాక్షి చెప్పకనే చెప్పింది. ఏపీలో మూడు రాజధానులు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై ఇబ్బందులు. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులను గుర్తుచేశారట. ఏపీను ఆర్ధికంగా ఆదుకునేందుకు సహకరించమని మాత్రమే జగన్ కోరారట. మరి ప్రతికూల మీడియాలకు మాత్రం.. అబ్బే ఇవన్నీ ఒట్టిబూటకాలు.. జగన్‌పై సీబీఐ దర్యాప్తును ఆపించటం, లోకేష్‌బాబును ఏదోవిధంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టించటం.. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో కటీఫ్ చేసుకోమని సూచించటం వంటివి ఎన్నో మాట్లాడి ఉంటారంటూ ప్రచారం చేయటం నిజంగానే విడ్డూరమే సుమా! అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.