కాపునాయకుడు, టీడీపీ నాయకుడు పురంశెట్టి అంకులు హత్య వెనుక ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు జిల్లా పల్నాడులో రెండ్రోజుల క్రితమ అంకులును దారుణంగా ప్రత్యర్థులు హతమార్చారు. పెదగార్లపాడు సర్పంచ్‌గా 15 ఏళ్లు సుదీర్ఘంగా పనిచేశారు. పార్టీలకు అతీతంగా ఆయనంటే కాపు వర్గంలో అభిమానం ఉంది. జిల్లాలోనే కీలక నేతగా ఎదిగారు. ఇటువంటి సమయంలో ప్రత్యర్థులు ఘాతుకానికి తెగబడ్డారు. ఇదంతా అధికార పార్టీ పనేనంటూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు. వాస్తవానికి గురజాలలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యరపతినేని మధ్య గొడవ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల తొడలు కొట్టుకుని మరీ సవాళ్లు విసురుకున్నారు. రెడ్డి వర్సెస్ కమ్మ వైరంగా సాగే వ్యవహారంలో కాపు సామాజికవర్గాన్ని పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పల్నాడులో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపులు టీడీపీ వైపు మొగ్గు చూపుతుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు కాపులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. దీంతో కొందరు కాపు నాయకులు ఊళ్లొదిలి వెళ్లిపోయారు. మరికొందరు అజ్ఞాతంలోకి చేరుకున్నారు. ఇటువంటి భయంకరమైన వాతావరణంలో అంకులు హత్య కాపుల్లో మరింత గుబులు రేకెత్తించేలా చేసింది. బావ మరణంతో అతడి బావమరిది యడ్లవల్లి శ్రీనివాస్ రెండ్రోజులుగా కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు. చివరకు మంగళవారం గుండెపోటుతో మరణించాడు. నిజంగా ఇది ఆధిపత్యం కోసం జరిగిన హత్యా.. లేకపోతే పాత పగలతో దారుణానికి తెగబడ్డారా అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది.



