తల్లడిల్లే పల్లె

పల్లెసీమ పల్టీ గొట్టె
ఏతపు బావులు ఎగిరిపోయె
మోట బాయిల కాడి ఊడె
కుంటలన్నీ కూలిపాయె
ఎడ్ల బండ్లు ఏడబోయె
ఏరువాక సందడంతా
ఏట్ల గలసిపాయే
మువ్వపట్టెళ్ల సవ్వడి మూగబోయె
బండ్లు తోలు చర్నకోల వూసిపోయె
మక్కెనగుచ్చు ముల్లుగర్ర ముక్కలాయె
బాలింత బర్రెలకు సూదులేసె
ముర్రుబాల లేగదూడలు మూతిముడిచె
పల్లావు నల్లావు జాడ లేదు
బక్కచిక్కినావులన్ని
కబేళాల్లో బారులుతీరె
ఎర్ర జొన్న సేలల్లో
మంచెలన్నీ మరుగునపడెనె
పిట్టలదోలు వడిశలను
డేగలెత్తుకు పోయెనె
మంచినీళ్ల బుర్రకాయని
రంగునీళ్ల బాటిలెక్కిరించెనె
పెద్దింటి భోషాణాలు
కూసాలూడి కూలబడె
అమ్మవారి అలంకరణ
తగరపు హారాలతో తళుక్కుమనె
తొలికోడి కూత కరువాయె
తెల్లకోడి మక్కువాయే
డప్పు కొట్టే నాగన్న పాట
తీత రాగం తీసేనే
పెళ్లి పందిళ్లు పరారయ్యె
రంగు గొడుగులు రాజ్యమేలె
పారాణద్దిన పల్లె పడచు ఎక్కే
మేనా మదిలో యాది లేకపోయె
ఊరేగించే పెళ్లి పల్లకీని
చలన చిత్రాలు గుర్తు చేసె
కుంది రోళ్లు కుంగిపోయె
మర గ్రైండర్ మోదమాయె
వెదురు చాటలు మోటుగాయె
ప్లాస్టిక్ చాటలు మెరిసిపాయె
తైలం ఒడిసే తెలకలోళ్లు
తిరిగిరాకపాయె
కుమ్మరి కొలిమి కుదేలయి
శాలివాహన శేషయ్య కూలిలో జేరె
బెమ్మ మెత్తిన బాడిసేమో
వడ్ల కొలిమిలో కాలిపోయె
వలలు విసిరే వలీ సాయిబు
చెరువు తిమింగలానికి బలయ్యె
తాళ్ల నెక్కు పైడితల్లి గౌడు
కార్పొరేట్ కల్లులోన మునిగిపోయె
చెరువుకాడ చాకలి బండ
పాటలేక పాచిబట్టే
బడికి పోయే బట్ట సంచి
చెదలుపట్టి చినిగిపాయే
చెక్క పలక మట్టిబలపం
సూద్దమన్నా లేకపాయె
మాయదారి ఫ్రీజ్ లొచ్చి
మట్టికుండ పుట్టి ముంచే
ఎగిసిపడ్డ ఎర్ర కేతనం
మంది లేక మొకం మాడ్చేనే
తిరిగిరానీ రోజులన్నీ
తలుసుకుంటూ తల్లడిల్లె పల్లె
పల్టీగొట్టె నా పల్లె
కన్నీరుపెట్టే నా పల్లె తల్లి

—పెర్నా విశ్వేశ్వరరావు – సత్తుపల్లి
9704197101

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here