ష‌ర్మిల వెనుక అదృశ్య‌శ‌క్తి ఎవ‌రు???

తెలుగు రాజ‌కీయాల్లో ఇదొక చ‌ర్చ‌. అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. ఎవ‌రికి వారే విశ్లేషించుకుంటూ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూతురు ఏర్పాటు చేసే కొత్త పార్టీతో మాకేం ప్ర‌మాదం లేదంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంత అక‌స్మాత్తుగా ఇన్నేళ్ల త‌రువాత జ‌గ‌న్ సోద‌రి షర్మిల కొత్త పార్టీ పెట్ట‌డం వెనుక ఆంత‌ర్యం అంతుబ‌ట్ట‌కుండా ఉంది. బీజేపీ, టీఆర్ ఎస్ నెత్తిన పాలుపోసేందుకు కాంగ్రెస్‌ను దెబ్బ‌తీసేందుకు ష‌ర్మిల‌తో తెర‌వెనుక శ‌క్తులు న‌డిపిస్తున్న నాట‌క‌మంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌వారూ ఉన్నారు. ప‌దేళ్ల క్రితం ఓదార్పుయాత్ర‌లో నేను జ‌గ‌న‌న్న వ‌ద‌లిన బాణాన్నంటూ ప్ర‌సంగాల‌తో ఉద్వేగానికి గురిచేసి.. అన్న‌తోడే లోక‌మంటూ వంద‌లాది కిలోమీట‌ర్లు న‌డ‌చి.. ఆ త‌రువాత మోకాళ్ల కు పుండ్లుప‌డి ఆప‌రేష‌న్లు చేయించుకున్న ష‌ర్మిల‌కు అన్న చేసిన అన్యాయం ఏమిటీ. చెల్లి రాజ‌కీయంగా ఎదిగితే త‌న‌కు ప్ర‌మాదం అని ఊహించారా! లేక‌పోతే.. తాను ఉండ‌గా మ‌రో వార‌సురాలు ఎందుక‌నే భావ‌న‌లో ఉన్నారా! అన్న‌తో స‌యోధ్య కుదిరినా.. వ‌దిన భార‌తితో ఏమైనా కుటుంబ త‌గాదాలున్నాయా! అనే అనుమానాలు లేక‌పోలేదు.

పోన్లే.. ఏపీ గొడ‌వ ఎందుకు అనుకుంటే.. తెలంగాణ‌లో రాజ‌కీయ స్థిర‌త్వం ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ మూడు పార్టీలు గ‌ట్టిగానే కోట్లాడుకునేందుకు స‌రిప‌డ బ‌లంగానే ఉన్నాయి. మ‌రో వైపు ఎంఐఎం కూడా టీఆర్ ఎస్‌కు ఎప్పుడు అవ‌స‌ర‌మైతే అప్పుడు రంగంలోకి దిగేందుకు రెఢీగా ఉండే మిత్ర‌ప‌క్షం. బీజేపీ దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ సీట్ల గెలుపుతో మాంచి ఊపుమీద ఉంది.
తెలంగాణ‌లోనూ హిందుత్వ నినాదం బాగానే ప‌నిచేసింది. 2019లో నాలుగు ఎంపీ సీట్లు సాధించ‌టం వెనుక అదే కీల‌కంగా ప‌నిచేసింది. కాబ‌ట్టి 2024లో ఒంట‌రిగా పోరాడ‌గ‌ల‌మ‌నే న‌మ్మకానికి వ‌చ్చారు. జ‌న‌సేన దోస్తీ కోసం చేయి చాసినా తూచ్ అంటూ సంజ‌య్ వారించాడు. దీంతో జ‌న‌సేనాని రాత్రికి రాత్రే మా మ‌ద్ద‌తు తెరాస బ‌ల‌ప‌ర‌చిన పీవీ కుమార్తె సుర‌భి వాణీదేవికేనంటూ
చెప్పారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీలుగా ఇద్ద‌రూ టీఆర్ ఎస్ అభ్య‌ర్థులే గెలుపొందారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ష‌ర్మిల కొత్త పార్టీతో ఎవ‌రికి న‌ష్టం అనేది ప‌క్క‌న‌బెడితే.. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త‌గా ఉన్న రెడ్డి వ‌ర్గ నేత‌లంతా ష‌ర్మిల‌కు సంఘీభావం చెబుతున్నారు. మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, మేధావులు కూడా నెమ్మదిగా క్యూ క‌డుతున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే
ష‌ర్మిల కొత్త పార్టీ త‌మ‌కు ఇష్టం లేదంటూ ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారులు స‌జ్జ‌ల చెప్పినా.. జ‌గ‌న్ మీడియా సాక్షి ప‌త్రిక‌, ఛాన‌ల్ మాత్రం. ష‌ర్మిల అంటే.. లోట‌స్‌పాండ్‌లో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని చాలా పాజిటివ్ గా ప‌తాక శీర్షిక‌న ప్ర‌చురిస్తున్నారు. ఈ లెక్క‌న‌.. అన్న సంధించిన బాణంగానే ఇప్ప‌టికీ ష‌ర్మిల త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తుంద‌నేందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం అనేది విశ్లేష‌కుల అంత‌రంగం. ‌

Previous articleవిల‌న్‌గా మెగా బ్ర‌ద‌ర్‌!
Next articleతెలుగు నేల‌పై కాషాయ‌పార్టీకు ఉప ఎన్నిక‌ల గండం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here