రఘురామకృష్ణంరాజు.. అందరూ ట్రిపుల్ ఆర్‌గా ముద్దుగా పిలుచుకునే పార్లమెంట్ సభ్యులు. నర్సాపురం బరి నుంచి వైసీపీ తరపున గెలిచారు. రాజుల కుటుంబం నుంచి రావటంతో ఆ దర్పం కూడా కాస్త ఎక్కువగానే కనిపించేది. అసలు సమస్య కూడా అక్కడే వచ్చింది. రజనీకాంత్ భాషాలో పక్కనున్న వాళ్లంతా.. చేతిని ముద్దుపెట్టుకుంటే వావ్ అనిపించేది. అదే తరహాలో వైసీపీలోనూ నేతలు అధినేత జగన్ మోహన్‌రెడ్డి దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతుంటారు. రేపటి రోజు ఏదో మంత్రిపదవో.. నామినేటెడ్ పోస్టో రాకపోతుందా! అనే ఆలోచన కూడా చాలామంది బుర్రల్లో ఉంటుంది. దీనికి విరుద్ధంగా.. రఘురాముడు మాత్రం.. వైసీపీ ప్రభుత్వంపై చివాలున లేవటం ప్రారంభించాడు. అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వనీ సీఎం ఉంటే ఎంత అనేంత వరకూ విమర్శలు గుప్పించాడు.. మీడియా పుణ్యమాంటూ.. వైరం కాస్త తారాస్థాయికి చేరింది. ఆయన పెట్టుకునే విగ్గు ను కూడా విమర్శించేంత వరకూ చేరింది. బీజేపీను నెత్తిన పెట్టుకుంటూ నరేంద్రమోదీను పొగడటంతో వైసీపీ ఇక ఎంపీను భర్తరఫ్ చేయాలనుకుని నోటీసు పంపింది. అక్కడా.. అదే తిరుగుబాటు.. అసలు మీరెవరు నన్ను సస్పెండ్ చేయటానికి అంటూ తిరుగుటపాలో నోటీసు పంపినంత పనిచేశాడు. పోన్లే.. ఆయనతో మనకెందుకు అనుకున్నా.. అమరావతి రాజధాని తరలింపు జరగదు.. మీరెవ్వరూ అధైర్యపడవద్దంటూ తాజాగా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలకు దిశానిర్దేశం చేసి జగన్.. ఈయన ఒక్కడిని మాత్రం సమావేశానికి రానివ్వలేదు. చివరి నిమిషంలో సారీ.. రాజుగారు.. మీరు పార్టీ సమావేశానికి రావాల్సిన పనిలేదంటూ గాంధీభవన్ నుంచి వర్తమానం రావటంతో కాస్త ఇబ్బంది పడ్డారట. ఆ తరువాత తేరుకుని.. రెబల్‌స్టార్‌ను ఎవరు పిలుస్తారంటూ సరిపెట్టుకున్నారట. అసలు.. తాను ఏ పార్టీ ఎంపీను అనే అనుమానం కూడా వచ్చినట్టుంది. మోదీను ఆకాశానికి ఎత్తేసినంత మాత్రం.. బీజేపీ ఎంపీ కాలేడు. జగన్ తిట్టాడని వైసీపీ ఎంపీ లెక్క నుంచి తప్పించుకోలేడు.