వైవీ.. కొడాలి మంటను మ‌రింత ర‌గిల్చేలా ఉన్నార‌ట‌?????

అస‌లే ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క్రైస్త‌వుడ‌నే ప్ర‌చారం ఉంది. అయినా తాను హిందు మ‌తాన్ని అభిమానిస్తానంటూ విశాఖ‌పీఠం చుట్టూ తిరిగిన జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు మ‌మ అనిపించారు. దాదాపు ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్టుగానే అంతా భావించారు. కానీ.. ఆ త‌రువాతే అస‌లు క‌థ మొద‌లైంది. తిరుమ‌లలో కొలువైన క‌లియుగ‌దైవం భూములు క‌బ్జాకు గుర‌వుతున్నాయ‌నే అంశాన్ని చూపుతూ వేలం పాట‌కు వైసీపీ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది. విష‌యం ర‌చ్చ కావ‌టంతోపాటు.. హైకోర్టుకు చేర‌టంతో ప్ర‌భుత్వం మెట్టుదిగింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆదాయం ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌కు వాడుకుంటుంద‌నే వార్త కూడా క‌ల‌క‌లం రేకెత్తించింది. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌లో అన్య‌మ‌త ప్ర‌చారంపై కూడా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. సినీ న‌టుడు పృద్వీ, ఎస్‌వీబీసీ ఛాన‌ల్ ఛైర్మ‌న్‌గా ఒక మ‌హిళ‌తో ఫోన్ లోచేసిన సంభాష‌న కూడా వివాదాస్ప‌ద‌మైంది. చివ‌ర‌కు రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. తాజాగా 15 ప్రాంతాల్లో దేవాల‌యాల‌పై దాడులు.. విగ్ర‌హాల విద్వ‌సం.. ర‌థాల ద‌హ‌నం.. విగ్ర‌హాల మాయం ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసింది.

ఇంత‌టి సున్నిత‌మైన స‌మ‌యంలో ఆచితూచి స్పందించాల్సిన ప్ర‌భుత్వం ఎందుకో దూకుడుగా ప్ర‌వ‌ర్తిస్తోంది. టీటీడీ ఛైర్మ‌న్ వై.విసుబ్బారెడ్డి, మంత్రి కొడాలి నాని అగ్గికి ఆజ్యం తోడైన‌ట్టుగా.. వివాదాన్ని మ‌రింత రెచ్చ‌గొట్టేలా త‌ర‌చూ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా త‌మ వ్య‌క్తిగ‌త‌మ‌ని చెబుతున్నా.. ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వీరిద్ద‌రి ప్ర‌భావం జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఇప్ప‌టికే పీక‌ల్లోతు కేసులు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని వెంటాడుతూనే ఉన్నాయి. కేంద్రంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ ఏపీలో బీజేపీతో మాత్రం ప్ర‌త్య‌ర్థిగానే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీటీడీ ఛైర్మ‌న్ వైవి అన్య‌మ‌త‌స్తుల‌కు డిక్ల‌రేష‌న్ వ‌ద్దంటూ చేసిన కామెంట్ దుమారం రేకెత్తించింది. సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఎన్నో ఏళ్లుగా కొన‌సాగిస్తున్న‌
సంప్ర‌దాయాన్ని తూచ్ అంటూ వైవీ కొట్టిపారేస్తున్నారు. సీఎం హోదాలో జ‌గ‌న్‌కు అది వ‌ర్తించ‌దంటూ తేనెతుట్టె క‌దిపారు. అస‌లు ఈ విష‌యంపై వైవి స్పందించాల్సిన అవ‌స‌రం లేదు. సీఎం హోదాలో జ‌గ‌న్ ఎక్క‌డికైనా వెళ్లేందుకు అవ‌కాశం ఉంది. కానీ వైవీ ఎందుకీ విష‌యాన్ని లేవ‌నెత్తార‌నేది కూడా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అంతుబ‌ట్ట‌ని విష‌యం. ఎంతైనా బాబాయ్ కాబ‌ట్టి.. అబ్బాయిపై అతిప్రేమ కూడా కార‌ణం కావ‌చ్చనే విమ‌ర్శ‌లూ ఎదుర్కోవాల్స వ‌చ్చింది. విమ‌ర్శ‌లు చుట్టుముట్ట‌డంతో నేను అలా అన‌లేదంటూ స‌ర్దిచెప్పుకోవ‌టానికి ఆయ‌న నానాపాట్లు ప‌డాల్స వ‌స్తోంది.

కొడాలి నాని.. గౌర‌వ‌నీయమైన మంత్రి ప‌ద‌విలో ఉన్నారు. చంద్ర‌బాబును ఎన్ని తిట్టు తిట్టాలో దాదాపు అన్నీ తిట్టేశారు. తెలుగు పండితులు కూడా.. ఆయ‌న బూతుల పంచాంగం విప్పిన‌ప్పుడు.. అర్ధాల కోసం నిఘంట‌వులు అదేనండీ డిక్ష‌న‌రీలు వెతికేంత వ‌ర‌కూ చేరింది. స‌ర్లే.. అదంటే రాజ‌కీయం.. ఆయ‌న బాబును ముస‌లి న‌క్క అన‌వ‌చ్చు.. లోకేష్‌ను ఇంకేదో అన‌నూ వ‌చ్చు. కానీ. హిందు దేవాల‌యాల‌పై చేసిన కామెంట్స్ మాత్రం హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయంటూ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆవేద‌న వెలిబుచ్చారు. బీజేపీ కూడా దీనిపై నిర‌స‌న‌లు తెలిపేందుకు సిద్ధ‌మైన‌ట్టు ప్ర‌క‌టించారు. అంత‌ర్వేది ర‌థం త‌గుల‌బ‌డితే ఏమైందంటాడు కొడాలి. పైగా.. దుర్గ గుడిలో వెండిసింహాలు పోయినా అమ్మ‌కు న‌ష్టంలేదంటూ చాలా వ్య‌గ్యంగా స్పందించ‌టం చూస్తే.. కొడాలి ఇంత‌గా ఎందుకిలా బ‌రితెగించార‌నే అనుమానాలు కూడా కొడాలి అభిమానుల నుంచే వ‌స్తున్నాయి. ఏమైనా.. ఈ ఇద్ద‌రూ జ‌గ‌న్ మెప్పుకోసం.. చివ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టేశార‌నేది వైసీపీ అభిమానుల అభిప్రాయం.

మ‌రి దీన్ని స‌రిదిద్దేందుకు మంత్రి వెల్లంప‌ల్లి రంగంలోకి దిగిన‌ట్టున్నారు. టీడీపీ హ‌యాంలో కూల్చిన 44 గుళ్ల‌ను నిర్మించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. వ‌రుస దాడుల‌తో పోయిన ప‌రువును.. గుళ్ల పునఃనిర్మాణంతో రాబ‌ట్టుకునేందుకు మంత్రి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం శుభ‌ప‌రిణామ‌మే. అదే విధంగా ఆల‌యాల పై దాడుల‌కు తెగ‌బ‌డిన ద్రోహుల‌ను కూడా గుర్తించి జైల్లో వేయించ‌గ‌లిగితే హిందూస‌మాజం కాస్త‌యినా శాంతిస్తుంది.. స‌ర్కారు త‌ప్పుల‌ను క్ష‌మిస్తుందంటూ హిందూసంఘాలు సూచిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here