పెద్ద పదవులో ఉన్నామని ఆనందపడాలా! చిన్నవాళ్ల దగ్గర చులకన అవుతున్నామా! అని ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. పాతికేళ్ల కిందట.. ఎంపీగా ఎంపికైన నేతకు పార్టీలో.. ఎమ్మెల్యేల్లో మంచి గుర్తింపు.. గౌరవభావం ఉండేది. నియోజకవర్గానికి ఎంపీ వస్తున్నారంటే.. సాదరంగా ఆహ్వానించేవారు. ఇదంతా గతం అప్పట్లో.. మేధావులు, సామాజిక సృహ ఉన్న గొప్ప భావాలున్న నాయకులు ఢిల్లీలో లోక్‌సభ, రాజ్యసభకు ఎంపికయ్యేవారు. కాలంతోపాటు.. ఇప్పుడు రౌడీషీటర్లు, పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్న నాయకులు, వ్యాపారవేత్తలు, బ్యాంకులకు బురిడీ కొట్టించే మాయగాళ్లు, వైట్‌కాలర్ కంత్రీలు, ఎంతబాగా బూతులు తిట్టగలరో వారికే పార్టీలో కూడా ఢిల్లీకు పంపుతున్నాయి. గత టీడీపీ హయాంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య అంతర్వుద్ధం జరిగినా బయటకు రాకుండా జాగ్రత్తపడేవారు. అధినేత చంద్రబాబునాయుడుకు భయపడో.. లేకపోతే… పదవి ఊడితే.. అప్పులోళ్లు ఇళ్ల మీద పడతారనే గుబులు వల్లనో సైలెంటయ్యేవారు.
ఇప్పుడు వైసీపీ ఎంపీల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 6-7 గురు ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ ఎంపీ అనే గౌరవం ఇవ్వటం పక్కన బెడితే.. తమకు తెలియకుండా అసెంబ్లీ పరిధిలోకి వస్తే.. ఒంటికాలి మీద లేస్తున్నారు. గ్రూపులు కట్టి రేపటి రోజున తమ ఎమ్మెల్యే పదవికి ఎసరు పెడతారనే బాధ కొంది ఎమ్మెల్యేలను భయపెడుతుందట. విశాఖ నుంచి రాయలసీమ జిల్లాల వరకూ దాదాపు 10 మంది ఎంపీలు.. తమకు నియోజకవర్గంలో కనీస గౌరవం దొరకట్టేదంటూ పార్టీ పెద్దల వద్ద గొల్లుమంటున్నారట. టీడీపీ ఎంపీల పరిస్థితి మరీ ఘోరంగా మారిందట. అటు జనాల్లోకి పోలేరు.. పోన్లే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో తిరుగుదామంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తలనొప్పులు. దీంతో వైసీపీ ఎంపీలు కూడా తాము అధికారపార్టీ ఎంపీలుగా ఉన్నా.. ప్రతిపక్ష పార్టీ ఎంపీలుగానే ఉండాల్సి వస్తోందనుకుంటున్నారట. అందుకే.. వీలైనంత వరకూ ఎక్కువ సమయంలో ఢిల్లీలో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారట. రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయితే.. ఢిల్లీలోనే మకాం వేశారు.
గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరిందట. గుంటూరు జిల్లాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాయలసీమ జిల్లాల్లోని ఎంపీలు సంజీవ్‌కుమార్, మిధున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, విశాఖజిల్లాలో ఎం.వి.విసత్యనారాయణ.. తమపార్లమెంటరీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో తరచూ తలపోట్లు చవిచూస్తున్నట్టుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీలుగా ఎన్నికైన నాయకులు ముందుగా అసెంబ్లీ నియోజకవర్గంపై ఆశ పెట్టుకున్నవారే. కానీ కాలం కలసిరాక.. చివరకు ఎంపీగా బరిలోకి దిగి గెలిచిన వారే కావటం.. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలతో కోల్డ్‌వార్‌తో చికాకు పడుతున్నారట. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు కూడా ఎంపీలను కలిస్తే.. ఎమ్మెల్యేలకు కోపం వస్తుందనే ఉద్దేశంతో ఎంపీల వైపు కన్నెత్తి చూసేందుకు వెనుకంజ వేస్తున్నారట. ఒకవేళ ఎంపీలు పర్యటకు వస్తామంటూ.. లోకల్ నాయకులకు సమాచారం.. ఇస్తే.. సారీ.. సార్.. మేము అక్కడ లేమంటూ మరీ తప్పించుకుంటున్నారట. ఎంపీ సీటుపై ఆశపెట్టుకుని చివరి నిమిషంలో సీటు రాకుండా మిగిలిన నాయకులు. ఇప్పుడున్న పరిస్థితి చూసి.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవటం కొసమెరుపు.