అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఇరు వర్గాల ఘర్షణ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మెడకు చుట్టుకుంది. ఆర్చి విషయంలో ఎస్సీ వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ రాళ్లదాడికి వరకూ చేరింది. అదే సమయంలో అంట్లు తోముకుంటున్న మరియమ్మ అనే మహిళకు రాళ్లు బలంగా తగిలాయి. తీవ్రగాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో మరియమ్మ బంధువులు, వర్గీయులు ఆందోళనకు దిగారు. అసలే నిప్పు.. ఉప్పుగా ఉండే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ల మధ్య మరియమ్మ మరణం మరింత రచ్చ చేసేందుకు కారణమైంది. తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనంపై పలుమార్లు వైసీపీ ఎమ్మెల్యే కోప్పడ్డారు. తనకు తెలియకుండా నియోజకవర్గంలో పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ పలుమార్లు హెచ్చరించారు. ఇసుక మాఫియా వెనుక ఇద్దరూ ఉన్నారనే ఆరోపణలతోనే గొడవలు మొదలయ్యాయంటున్నారు. శ్రీదేవితో తనకు ప్రాణహాని ఉందంటూ స్వయంగా వైసీపీ నేత ఒకరు సెల్ఫీవీడియో తీసి జగన్‌కు పంపటం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో వెలగపూడిలోని ఒక వర్గానికి ఎంపీ కొమ్ము కాస్తూ ఉన్నారని.. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ.. మరో వర్గం ఆరోపించింది. ఆందోళన చేపట్టారు. ఇదంతా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విబేధాలతోనే జరిగిందంటూ ఆరోపణలు పెరుగుతున్నాయి. అసలే.. ఇద్దరు నేతల మధ్య ఉన్న గొడవలతో చికాకు పడుతున్న పార్టీ పెద్దలకు కొత్తగా మొదలైన గొడవలు మరింత ఇబ్బంది పెడుతున్నాయట. దీన్ని ఏదోవిధంగా సర్దుబాటు చేసేందుకు సీఐ ధర్మేంద్రను వీఆర్‌కు పంపారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి నచ్చజెప్పేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.



