బెజవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడిచేసి హతమార్చిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం విజయవాడ క్రీస్తురాజపురంలో దివ్యతేజస్విని అనే యువతిపై నాగేంద్రబాబు అలియాస్ చినస్వామి కత్తితో దాడి చేశాడు. కసితీరా 21 కు పైగా కత్తిపోట్లతో దాడికి తెగబడ్డాడు. అనంతరం అతడు కూడా మెడలో, కడుపులో అదే కత్తితో పొడచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ దివ్య మరణించగా.. నాగేంద్రబాబు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రేమించని నేరానికి అతడు దారుణానికి తెగబడినట్టుగా పోలీసులు భావించారు. కానీ.. పోలీసుల విచారణలో నాగేంద్రబాబు కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చాడు. దివ్య తాను ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నట్టు చెప్పాడు. ఈ ఏడాది లాక్‌డౌన్ సమయంలో మంగళగిరిలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తరువాత ఎవరికి వారే ఉంటున్నారు. కొద్దినెలల క్రితం దివ్య ఇంట్లో విషయం తెలియటంతో కట్టడి చేశారు. అతడి ప్రవర్తన గురించి తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. కూతురు జీవితం నాశనం అవుతుందని భయపడ్డారట. గంజాయి మత్తులో జోగుతూ ఉండే నాగేంద్ర అని దురలవాట్లకు బానిసగా మారినట్టు గుర్తించారు. ఈ విషయం గ్రహించిన దివ్య చదువుపై దృష్టి పెట్టింది.. అతడిని దూరంగా ఉంచటంతో తట్టుకోలేకపోయాడు
గంజాయి మత్తులో ఇంట్లోకి ప్రవేశించాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యపై దాడి చేశాడు. తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దివ్య తల్లి ఇంటికి వచ్చి చూడటంతో ఇద్దరూ రక్తపు మడుగులో ఉన్నట్టు గుర్తించారు. ఈఎస్ ఐ ఆసుపత్రి అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దివ్య మరణించింది. నాగేంద్ర కు
రెండు ఆపరేషన్లు చేసిన వైద్యులు 48 గంటలు గడిస్తే కానీ అతడి ఆరోగ్యం గురించి క్లారిటీ ఇవ్వలేమన్నారు. సృహలోకి వచ్చిన సమయంలోనే నాగేంద్ర అసలు విషయం బయటపెట్టాడు. తామిద్దరం పెళ్లిచేసుకున్నామని.. దివ్య తండ్రి కావాలనే తమను దూరంచేశాడంటూ చెబుతూ సృహకోల్పోయాడు. అయితే.. హత్య జరిగిన ఇంట్లో ఓ వైపు ఫ్యాన్‌కు వేలాడుతూ తాడు కనిపించందంటున్నారు. అంటే.. ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా! లేకపోతే.. నాగేంద్ర కోపం పట్టలేక హత్యకు పాల్పడ్డాడా అనేది పోలీసులు దర్యాప్తులో బయటకు రావాల్సి ఉంది.



