తెలంగాణలో రాజన్నరాజ్యం తీసుకొస్తాం. రైతన్నల కష్టాలు తీర్చుతానంటూ కొత్త పార్టీతో వైఎస్సార్ తనయ షర్మిలమ్మ కొత్త పార్టీ పెట్టబోతుంది. దాదాపు ఇప్పటికే ఎన్నికల సంఘానికి పార్టీ పేరు, గుర్తులతో దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఎప్పుడు పార్టీ పెట్టాలి.. ఎలాంటి పేరుండాలి. అసలు తెలంగాణలో పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రాజకీయ నిరుద్యోగులు. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లో ఉన్న రెడ్డి వర్గానికి చెందిన అసంతుష్టుల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారట. ఇటీవల రెడ్డి వర్గానికి చెందిన నాయకులు, అధికారులు కీలక సమావేశం కూడా నిర్వహించారట. అయితే.. ఇప్పటికే బీజేపీ బలంగా మారింది. టీఆర్ ఎస్ కేడర్ కూడా గట్టిగానే ఉంది. కాంగ్రెస్‌ను కూడా బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటువంటి సమయంలో ఆంధ్రపై ఉన్న వ్యతిరేకత షర్మిలకు అడ్డంకిగా మారింది. హిందుత్వ భావన బలంగా వినిపించే తెలంగాణలో షర్మిల, అనిల్ దంపతుల క్రైస్తవం కూడా మరో అడ్డుగోడగానే షర్మిలమ్మ అనుచరులు లెక్కలు కడుతున్నారట. వీటన్నింటినీ అధిగమించి.. జనాల్లో వైఎస్సార్ పట్ల ఉన్న ఎమోషన్‌ను క్యాష్ చేసుకునేందుకు వైఎస్, కాంగ్రెస్ రెండూ తమ పార్టీ పేరులో ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారట. గుర్తు కూడా తెలంగాణ ఎమోషన్‌కు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారట. ఎకరాల విస్తీర్ణంలో పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మించాలనుకుంటున్నారట. అవసరమైతే.. కొత్త మీడియా వ్యవస్థలను కూడా నడపాలనే అంచనా వేసుకుంటున్నారట. ఈ లెక్కన.. కొత్త పార్టీలో కొత్త ఛానెళ్లు, కొత్త పత్రికలు కూడా పురుడు పోసుకుంటాయట. ఏమైనా.. షర్మిలమ్మ.. అన్న వదలిన బాణాన్నంటూ బాగానే పాపులారిటీ సంపాదించి.. దాన్ని కొత్త పార్టీ కోసం ఉపయోగించుకోవటాన్ని వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారట. ఇప్పటి వరకూ చంద్రబాబును వెన్నుపోటు దారుడంటూ విమర్శించిన వైసీపీకు ఇప్పుడు షర్మిల కూడా అదే దారిలో ఉంటుందంటూ టీడీపీ ఎదురుదాడి చేస్తే ఏం చేయాలనేది కూడా గుబులు పుట్టిస్తుందట.