జగనన్న బాణం కొత్తపార్టీ వెనుక ఏం జరిగింది. అకస్మాత్తుగా తెలంగాణపై ఇంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది. ఇదంతా రాజకీయ జగన్నాటకమా.. లేకపోతే తెర వెనుక టీఆర్ ఎస్‌కు సహాయపడాలనే ఆంతర్యమా! అన్నతో అంతర్గత గొడవలు కారణమా? ఏమో అసలు సంగతి ఏమైనా.. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి ఇది ఊహించని ఝలక్. చెల్లి షర్మిలమ్మ.. తనకే తెలియకుండా అదీ లోటస్‌పాండ్‌లో కొత్త పా ర్టీ ప్రకటన చేయటం.. తనకు పెద్ద దిక్కుగా నిలిచే కేసీఆర్‌ను విమర్శించటం.. నిధులు, నీళ్లు, నియామకాలు ఏమీలేవని.. అసలు రాజన్నరాజ్యం లేదంటూ షర్మిల కుండబద్దలు కొట్టేంత వరకూ చేరటం వైసీపీ వర్గాలను కూడా నివ్వెరపరచింది. కొద్దిరోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కొత్తపలుకు పేరుతో రాధాకృష్ణ రాసిన వ్యాసంపై సంచలనమైంది. ఇదంతా కేవలం జగన్‌పై అక్కసుతోనే రాశాడని భావించారు. కానీ.. మూడు నెలల నుంచే తెలంగాణలో వైసీపీను విస్తరించాలనే ఆలోచనను తాము అధినేత జగన్ వద్ద వెలిబుచ్చామంటూ స్వయంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. షర్మిలమ్మ కొత్తపార్టీపై ఏం మాట్లాడాలో తెలియని అమోమయంలో సజ్జల తడబడ్డారు. పైకి నవ్వుతూ ఉన్నా లోలోన ఏదో తెలియని ఆవేదన.. తెలంగాణలో తమకు తెలియకుండానే షర్మిల పార్టీ ఏర్పాటు చేయటంపై ఎలా సమర్ధించాలో అర్ధంగాక ఫాపం బిక్కమొహం వేసినంత పనిచేశారు.
రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన షర్మిల కొత్త పార్టీ.. జగన్ వ్యూహంలో భాగంగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ను సీఎం సీటుకు పదిలం చేసేందుకు కాంగ్రెస్‌ను దెబ్బతీసి.. బీజేపీ ఓట్లు చీల్చేందుకు ఇదంతా వైసీపీ తెర వెనుక నాటకంగా బీజేపీ ఆరోపణలు చేస్తోంది. కానీ… కేసీఆర్ ఆరేళ్ల పాలనలో ఏం ఒరిగిందంటూ నిలదీయటం కాస్త నివ్వెరపాటుకు గు రిచేసిందనే చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ పట్ట రెడ్డి సామాజికవర్గం ఒకింత గుర్రుగా ఉంది. ఈటల రాజేందర్ ముసుగులో బీసీలు కూడా పార్టీ పట్ల అంటీముట్టనట్టున్నారు. కడియం శ్రీహరిని పక్కన బెట్టడం.. తుమ్మల దూరం కావటంతో ఆ రెండు సామాజికవర్గాలు కూడా దాదాపు కేసీఆర్ పట్ల ప్రతికూలతగా ఉన్నారంటున్నారు. మరోవైపు.. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ మంత్రుల అభిప్రాయంపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఎవరైనా నోరెత్తితే నాలుక కోస్తా అనేంతగా స్పందించారు. ఇన్ని రాజకీయ పరిణామాల మధ్య షర్మిల కొత్తపార్టీ వెనుక బలమైన కారణం ఏదో ఉందనేది అర్ధమవుతోంది. అది కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చుతుందా.. బీజేపీను గద్దెనెక్కిస్తుందా.. మళ్లీ రెడ్డి వర్గానికి పట్టం కట్టబెడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.