బ్రతుకులేని బడి పంతులు

మాతృ దేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ

అని నానుడిలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత దేవుడి పక్కన గురువుకు పీఠం వేసింది మన సంస్కృతి.. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానామృతాన్ని నింపేవాడే గురువు. చీకటి నుండి వెలుగు వైపు, అచేతనం నుండి చైతన్యం వైపు నడిపించేవాడే గురువు.
వృత్తి ఏదైనా కావొచ్చు…ఎంత గొప్పవాడైనా కావొచ్చు…కానీ ప్రాథమికంగా ప్రతి ఒక్కరు గురువు వద్ద ఓనమాలు దిద్దాల్సిందే..ఏ గురువు తన శిష్యుడు నుండి లక్షలు ఆశించడు. పట్టెడన్నం మెతుకులు, కాస్త గౌరవం…బతకలేని బడిపంతులు అని ఏనాడు అన్నారో గాని అది నేటి కరోన నేపథ్యంలో నిజమైంది…

రెండు తెలుగు రాష్ట్రాలలో 3 లక్షల దాకా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్నట్లు ఒక అంచనా..కరోన కారణంగా సమాజ అభివృద్ధిలో పరోక్షంగా ముఖ్య భూమిక పోషించే ఉపాద్యాయుడు మరియు అతని కుటుంబం వినిపించలేని ఆకలి కేకలతో పస్తులుంటున్న పరిస్థితి నేడు…

అసలే అరకొర జీతాలు, అదీ 10 నెలలు మాత్రమే జీతం తీసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న ప్రైవేట్ పాఠశాలలు , కళాశాలల్లో పనిచేయుచున్న సిబ్బందికి మార్చి నుండి జీతాలు లేవు..కొన్ని సంస్థలు 50 శాతం జీతాలు ఒకటి రెండు నెలలు చెల్లించాయి. కానీ ప్రస్తుతం నెలకొన్న విషమ పరిస్థితుల్లో విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు సిబ్బంది సేవలు పొంది గతంలో కోట్లు గడించి, విపత్కర పరిస్థితుల్లో సిబ్బందిని గాలికి వదిలేసాయి.మాథ్స్, ఫిసిక్స్, కెమిస్ట్రీ  వంటి కష్టమైన విషయాలు బోధించే వారికి మాత్రం కొంత వరకు జీతాలు చెల్లిస్తూ, మిగతా వారికి మొండి చెయ్యి చూపారు..ఇక చిన్నపాటి పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంస్థలు అసలు జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసాయి.

కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ పాఠాలు అంటూ కొత్త తంతుకు తెరలేపాయి. పోనీ పాఠాలు చెబుతున్న టీచర్ లకు జీతం ఇస్తున్నాయా అంటే అదీ లేదు. జీతాల సంగతి తరువాత చూద్దాం , ముందు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పండని, ఉపాధ్యాయులను ఆదేశిస్తున్నాయి . పాఠశాల స్థాయిలో తెలుగు, సోషల్, ఇంగ్లీష్ – కళాశాల స్థాయిలో ఆర్ట్స్, కామర్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం సబ్జెక్ట్ లలో పాఠాలు చెప్పించడంలేదు. మాథ్స్, ఫిసిక్స్, కెమిస్ట్రీ , బయాలజీ మాత్రమే చెప్పిస్తున్నారు. మరి మిగతా వారి సంగతి ఏమిటి అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
పాఠాలు బోధించాల్సిన ఉపాద్యాయుడు అరటి పళ్లు అమ్మడం, కూరగాయలు అమ్మడం, తాపీ పనికి వెళ్లడం లాంటి చేదు వార్తలను నిత్యం చూస్తూనే ఉన్నాము.

కార్మిక చట్టాల వీరికి వర్తించవు. ఉద్యోగ భద్రత గాని, EPF Act 1952 ప్రకారం వీరికి EPF గాని, ESI (15000 రూ.లోపు వేతనం పొందుతున్న వారికి ), గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా భీమా పథకాలు గాని వీరికి వర్తింప జేస్తున్న విద్యాసంస్థలు అతి స్వల్పం. అసంఘటిత కార్మికులకు ఇచ్చే సౌకర్యాలు కూడా వీరు పొందలేరు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 20 లక్షల కోట్లు పంపిణీ పథకం ప్రైవేట్ ఉపాధ్యాయులకు వర్తింపజేయకపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వాలు సరే. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది..దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అన్నది కొందరి అధ్యాపకుల ప్రశ్న, మరి ఎవరు ఆదుకోవాలి వీరిని..
దేశ సంపద ఫలాలు దేశ ప్రజలందరికీ సమానంగా అందాలన్న అంబేద్కర్ సూచన వీరికి అమలు కాదా?
అసలు వీరి బాధలు ఎవరికీ పట్టవా? ఇలా ఆకలితో అలమటీంచాల్సిందేనా..
అదీగాక ప్రభుత్వ కళాశాలలో, పాఠశాలలో పనిచేసే పార్ట్ టైం ఉపాధ్యాయులు , పారా టీచర్లు, అతిధి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఈ కోవలోకే వస్తారు…

పోనీ రేపు వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే, సంవత్సరం ఫీజులు యాజమాన్యాలు ఎలాగూ వసూలు చేస్తాయి, లేదా ప్రభుత్వం రేయింబర్సుమెంట్ ఇస్తుంది..అటువంటప్పుడు జూన్ నుండి బకాయిలు కొంత భాగమైనా చెల్లింపు జేసే మార్గం వైపు ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? లేదా ఆర్ధికంగా నిలదొక్కుకున్న విద్యా సంస్థలనుండి అడ్వాన్స్ ల రూపంలోగాని, లేదా యాజమాన్యాలు బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి బోధకులకు, బోధనేతర సిబ్బందికి బ్యాంకుల ద్వారా స్వల్ప కాలిక రుణాలు ఇప్పించే మార్గం ఏమైనా ఉందా?

అవసరమైతే సిబ్బంది నుండి , జీతాల్లో మినహాయించు కొమ్మని హామీగా బాండ్ కూడా యాజమాన్యాలు తీసుకోవచ్చు. అటు యాజమాన్యాలు గాని, ఇటు ప్రభుత్వాలు గాని ఆలోచించి సమస్య పరిష్కారం కనుగొని వీరికి న్యాయం చేస్తారని ఆశిద్దాం.

-పెర్నా విశ్వేశ్వరరావు, విశ్లేషకులు

Previous articleఆగ‌ని ఎక్కిళ్లు క‌రోనా ల‌క్ష‌ణ‌మేన‌ట‌!
Next articleమెగా ఫ్యామిలీ అందాల వేడుక‌!

5 COMMENTS

  1. Correct kuli ki velaleru white card radu brathakaleni roojulu wachayi central, state government alochichali

  2. అన్న , బాగుంది కాని ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

Leave a Reply to Eswara rao Cancel reply

Please enter your comment!
Please enter your name here