ఏపీలో కొద్దిరోజులుగా కులం కలకలం రేకెత్తిస్తోంది. ఇక్కడ ఇదేమీ కొత్తగాకపోయినా.. వైసీపీ, టీడీపీ మధ్య ఇది మరింతగా ఆజ్యంపోసింది. అపుడెపుడో వర్మ అనే దర్శకుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ రాజేసిన నిప్పు మెల్లగా రగులుతూ వచ్చింది. ఇటీవల విజయవాడలోని హోటల్ స్వర్ణప్యాలెస్‌లో కొనసాగుతున్న కొవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అక్కడ కరోనా లేకుండానే వైద్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. రోజుకు లక్ష చొప్పున ఫీజు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా సెంటర్ నడపటంపై విమర్శలు వెల్లువెత్తాయి. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం హోటల్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తున్నట్టు స్వయంగా ఛైర్మన్ రమేష్‌బాబు అంగీకరించారు. అనంతరం రమేష్, స్వర్ణప్యాలెస్ ఛైర్మన్ శ్రీనివాస్ కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. కానీ తాము అందుబాటులో ఉన్నామంటూ రమేష్ వెలుగులోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సినీ నటుడు రామ్.. తన పెద్దనాన్న రమేష్ తరపున ట్వీట్లు చేశారు. ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దీనిపై విజయవాడ పోలీసులు ఘాటుగా హెచ్చరించటంతో రామ్ రూటుమార్చాడు. కులం గురించి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. రమేష్ ఆసుపత్రి మేనేజ్‌మెంట్ గురించి ప్రశ్నించేందుకు గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు కుమార్తె డాక్టర్ శైలజను పోలీసులు ప్రశ్నించారు. దీనిపై డాక్టర్ శైలజ స్పందించారు. తాను ఏడెనిమిది నెలలుగా ఆసుపత్రిలో పనిచేయటం లేదని స్పష్టంచేశారు. అయినా పోలీసులు తన పుట్టుపూర్వోత్తరాలన్నీ అడిగి తెలుసుకున్నట్టు వివరించారు. అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదానికి రమేష్ ఆసుపత్రిని బాధ్యులను చేయటం సరికాదన్నారు. మూడు దశాబ్దాలుగా సంపాదించిన పేరు ప్రతిష్ఠలను దెబ్బతీశారంటూ డాక్టర్ శైలజ ఆవేదన వెలిబుచ్చారు. రమేష్‌బాబును రమేష్‌ఛౌదరిగా కులం పేరుతో చెడు ప్రచారం చేయటాన్ని తప్పుబట్టారు. న్యాయం తమ వైపున ఉందని.. తప్పకుండా నిజం జయిస్తుందనే భరోసా వ్యక్తంచేశారు.



