ఒక లేడిని వేటాడేందుకు క్రూరమృగాలు ఎలా దాడి చేస్తాయో.. కొన్ని మానవమృగాలు అదే విధంగా యువతిపై దారుణానికి తెగబడ్డారు. వినేందుకు వింతగా అనిపిస్తుంది. కాస్త సామాజిక సృహ ఉన్నవారికి దీనివెనక కుట్ర ఉందనిపిస్తుంది. ఇది నమ్మలేని నిజం. ఒక యువతిపై 139 మంది ఏళ్లతరబడి లైంగిక దాడికి తెగబడటం.. వినేందుకు చాలా వింతగా అనిపిస్తుంది. కాస్త మానవత్వం ఉన్నవాళ్లకు పాపం అనిపించకమానదు. ఎంతటి నరకం చవిచూసిందో.. ఇంకెంతటి మానసిక వేదనకు గురైందో.. చివరకు భరించలేక.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడ్రోజుల క్రితం 25 ఏళ్ల ఓ యువతి పంజాగుట్ట ఠాణాకు వచ్చింది. అందరిమాదిరిగానే ఏదో ఫిర్యాదు చేస్తుందనుకున్నారు. కానీ.. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ బోరున ఏడ్చింది. కాస్త సంబాళించుకుని.. అందరి పేర్లు పూసగుచ్చినట్టు కాగితంపై రాసిచ్చింది. సినీ నిర్మాతలు, నటులు, బుల్లితెరపై వెలుగొందుతున్న పెద్దలూ ఉన్నారు. పోనీ.. వారేమైనా అమాయకులా! అంటే.. ఏ ఒకరిద్దరో తప్ప ఎవరూ సుద్దపూసలు కాదు. అందుకే పోలీసులు కూడా ఫిర్యాదు స్వీకరించారు. దాదాపు 42 పేజీల ఎఫ్.ఐఆర్ చేశారు. అక్కడే పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఆమె కేసు పోలీసులకే సవాల్ విసిరింది. దీనిపై స్వయంగా తెలంగాణ డీజీపీ సమీక్షించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సీసీఎస్ లేకపోతే సీఐడీకు కేసును అప్పగించాలనుకుంటున్నారు.
ఒక విధివంచితురాలు.. ప్రతిచోట అవమానం ఎదుర్కొంది. భరించలేని కష్టాన్ని కన్నీటినీ దిగమింగుతూ బతుకెళ్లదీస్తోంది. చివరకు ఇదంతా తన వల్ల కాదనుకుంది. యువతి కథ వింటే కన్నీరు ఆగదు! మిర్యాలగూడకు చెందిన ఈమెకు యుక్తవయసులోనే పెళ్లయింది. అక్కడా లైంగిక వేధింపులే.. అంతే పోలీసుస్టేషన్‌కు చేరింది. ఆ మొగుడితో కాపురం నా వల్ల కాదంటూ బయటకు వచ్చింది. హైదరాబాద్ చేరగానే అందరూ ఆమె అందాన్నే చూశారు. జుర్రుకుందామని.. ప్రయత్నించారు. అలా ఒకరిద్దరు కాదు.. 139 మంది ఆమెను దారుణంగా మోసగించారు. ఇదంతా ఆమె చేసిన ఫిర్యాదు సారాంశం. అసలే పోర్నోగ్రఫీ పిచ్చి ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తోంది. ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ వేలంవెర్రిగా బానిసలవతున్నారు. ఈ యువతి కూడా పేద్దల వంకర బుద్దులకు బలైందనే అనమానాలు లేకపోలేదు. ఆమెను పోర్నోగ్రఫీ కోసం వాడుకుని ఉండవచ్చనే అభిప్రాయమూ ఉంది. ఆమె ఎంత తప్పటడుగులు వేసినట్టు కనిపించినా.. తాను కూడా ఒక మహిళే.. అబలను మాతృమూర్తిగా గౌరవించే సమాజంలో దుశ్చాసనుల మానభంగ పర్వంలో మోసపోయిన అభాగ్యురాలు. ఈ కేసును తేలికగా తీసుకుని.. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని కొట్టేస్తారు. వాస్తవాలను వెలికితీసి కీచకులను జైలు ఊచలు లెక్కించేలా చేస్తారా!



