మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి డీజీపీ గౌతమ్ సవాంగ్ అభీష్టం మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ తోడుగా ఉంటుందని హామీ తెలిపారు .
ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు, చిన్నారులపైన జరుగుతున్న అత్యాచారాలకు సంభందించిన కేసులలో నిందితులను కఠినంగా శిక్షించేందుకు దోహదపడే విధంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆకాంక్షల మేరకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ తీసుకొచ్చిన, అమలు చేస్తున్న ఎన్నో సంస్కరణలు అనతికాలంలోనే సత్ఫ్పలితాలను ఇస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దిశ చట్టం అమలు చేస్తుందని, అందుకు నిదర్శనం మొన్నటికి మొన్న 2019 నవంబర్ 10 న గొల్లపూడిలో జరిగిన 7 సం. ల బాలికపై అత్యాచారం & హత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఐదవ అదనపు జిల్లా మరియు స్పెషల్ జడ్జి తీర్పు అని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు చెప్పారు.
సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కు ఇప్పటికే అప్పగించడం జరిగిందని అతి త్వరలోనే సిబిఐ అధికారులు ఈ కేసుకు సంభందించిన దర్యాప్తును పూర్తి చేస్తారని చెప్పారు. దర్యాప్తులో రాష్ట్ర పోలీస్ శాఖ సిబిఐ కు అన్ని విధాలా పూర్తి సహాయ సహకరాలను అందిస్తుందని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు స్పందిస్తూ తమ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేసును సిబిఐ కి అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తమకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పోలీస్ ఇస్తున్న హామీ తమకు ఎంతో భరోసా కల్పిస్తుందన్నారు. త్వరగా సిబిఐ కేసు దర్యాప్తును ప్రారంభించి తమ కూతురు మృతికి కారకులైన అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.



