నిజమే.. ఎవరికైనా సహజంగా వచ్చే అనుమానమే. గతానికి భిన్నంగా ఏపీలో జగన్ సీఎం అయ్యాకనే ఎందుకిలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ అండ చూసుకుని ఎవరైనా ఇదంతా చేస్తున్నారా! జగన్ మరింత బలపడకుండా జనంలో పలుచన చేసేందుకు ప్రత్యర్థులు పనిగట్టుకుని సున్నితమైన అంశాలతో ఇబ్బంది పెడుతున్నారా! అనే అనుమానాలు కూడా లేకపోలేదు. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ మత పరమైన అంశాల పట్ల ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శిస్తుంటారు. కేరళలో అపుడపుడూ హిందు మనో భావాలు దెబ్బతీసేలా కొన్ని ఘటనలు జరిగినా ఏపీలో వంటివి ఎన్నడూ చోటుచేసుకోలేదు. టీడీపీ హయాంలోనూ ఇటువంటి వరుస ఘటనలు జరిగాయి. పైగా కృష్ణపుష్కరాల్లో 20 మందికి పైగా మరణిస్తే.. దానిపై విచారణ కూడా సరిగా జరగలేదు. కనకదుర్గమ్మ వారి గుడిలో క్షుద్రపూజలు కూడా అప్పట్లో కలకలం సృష్టించాయి. కానీ ఇవేమీ అప్పట్లో హిందుత్వ సంఘాలు పెద్దగా పరిగణలోకి తీసుకోలేకపోయాయి. టీడీపీ -బీజేపీ రెండు మిత్రపక్షాలు కావటం వల్లనే కాషాయనేతలు నోరు మెదపలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. అయితే.. బీజేపీ నయా అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ హయాంలో జరిగిన ఘటనలపై కూడా విచారణ చేపించమంటూ డిమాండ్ చేసి తప్పిదాలను సరిదిద్దుకునేందుకు కొంత ధైర్యం చేశారు.
బీజేపీ ఏపీలో పట్టుకు సిద్ధమైంది. దీనిలో ఏ డౌట్ లేదు. అదే సమయంలో జాతీయస్థాయిలో తమ హిందు నినాదాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంది. అందుకే.. హిందువులు ఎదుర్కొనే సమస్య తరపు తమ గొంతు విప్పుతున్నారు. హిందు ధార్మిక సంస్థల నుంచి వస్తున్న ఆదాయాన్ని పరమత ప్రార్థనామందిరాలకు, విదేశాల్లో ఉన్న మతాలయాలకు దర్శించటానికి వెచ్చించటాన్ని కూడా తప్పుబడుతోంది. తమకూ కాశీ, బద్రీనాథ్ వంటి యాత్రలు చేసేందుకు కూడా సాయం చేయమంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీలో వరుసగా హిందుదేవాలయాలపై జరుగుతున్న దాడులు వారి మనోభావాలపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. దాని ఫలితమే.. ఇంతటి నిరసనలు. దేవాదాయశాఖ మంత్రి ఇంటికి సమీపంలోని దేవాలయంలో ఏకంగా మూడు వెండి సింహాల ప్రతిమలు చోరీ కావటం.. దీనిపై నాలుగో సింహం కేసు నమోదు చేసి దర్యాప్తు షురూచేశారు. ఉగాది తరువాత దాని జోలికే వెళ్లలేదంటూ ఈవో ఫిర్యాదు చేశారు. దీన్నిబట్టి.. హిందు దేవాలయాల్లో నిర్వహణ ఎంత మసకబారిందనేది అర్ధం చేసుకోవచ్చంటూ బీజేపీ శ్రేణులు ఆవేదన వెలిబుచ్చాయి. ప్రభుత్వానికి సవాల్‌గా మారిన వరుస ఘటనలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఏపీ సర్కార్ ఎంత కఠినంగా వ్యవహరించనుందనేది ఆసక్తిగా మారింది.
రాష్ట్రంలో అరాచకం సృష్టించి ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ఒక వర్గం చూస్తుంది.. ఈ దుర్మార్గానికి సాయపడే శక్తులు, వ్యవస్థలు ఏవన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంత దుర్మార్గమా? ఖాచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు…