నందిగామ మున్సిపాలిటీపై ఎగిరే జెండా ఎవ‌రిదో??

ప‌శ్చిమ‌కృష్ణాలో కీల‌క‌మైన ప్రాంతం నందిగామ‌. మెట్ట‌సీమ‌లో ఆణిముత్యంగా గుర్తింపు. ఇక్క‌డ నుంచి ఎవ‌రు నెగ్గినా మంత్రిప‌ద‌వి ప‌క్కా అనేంత‌గా రాజ‌కీయం నెర‌ప‌గ‌ల నేత‌లు నందిగామ సొంతం. తెలుగుదేశం పార్టీకు కంచుకోట‌. ఇక్క‌డ ఇత‌ర పార్టీలు నెగ్గటం సాహ‌సోపేమ‌త‌మైన చ‌ర్యే. 2004లో వైఎస్ .రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర‌తో ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌భంజ‌నం సృష్టించినా ఇక్క‌డ మాత్రం గెలువ‌లేక‌పోయారు. ముక్క‌పాటి వెంక‌టేశ్వ‌రావు, వ‌సంత నాగేశ్వ‌రావు, దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఉమా మహేశ్వ ‌రావు, తంగిరాల ప్ర‌భాక‌ర్‌రావు వంటి వారు త‌మ‌దైన ముద్ర‌వేసుకున్నారు. ప్ర‌భాక‌ర్‌రావు వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తంగిరాల సౌమ్య మాత్రం ప్ర‌జల‌కు అనుకున్నంత చేరువ కాలేక‌పోయారు. మండ‌లానికో లీడ‌ర్‌కు అధికారం అప్ప‌గించి తాను కేవ‌లం పాత్ర‌దారిగా మిగిలార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. మండ‌లాల్లో పీఠం వేసిన షాడో నాయ‌కులు అవినీతి, అక్ర‌మాల‌కు తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీశారు. కులాల వారీగా కూడా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నందిగామ‌లో ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. వైసీపీ త‌ర‌పున ప‌దేళ్ల‌పాటు నందిగామ‌లో ఉంటూ.. మా డాక్ట‌ర్ గారూ అనేంత గా మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు పేరు సంపాదించారు. త‌మ్ముడు అరుణ్‌కుమార్ ఆన్నకు మ‌రింత అండ‌గా నిల‌వ‌టంతో పోరాడి.. గెలుపు ద‌క్కించుకున్నారు. టీడీపీలోని షాడో నేత‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సీనియ‌ర్ నేత‌లు వైసీపీకు స‌పోర్టు చేయ‌టం మ‌రింత క‌ల‌సివ‌చ్చింది. ఇది గ‌తం.. మ‌రి ఇప్పుడు

నందిగామ మున్సిపాలిటీ కూడా చేజిక్కించుకోవాల‌ని వైసీపీ వ్యూహం. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వానికి మున్సిపాలిటీలో గెలుపు ద్వారా స‌మాధానం చెప్పాల‌నేది టీడీపీ ప్ర‌తివ్యూహం. ఎవ‌రికి వారే జెండా ఎగ‌ర‌వేసేందుకు తెగ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇంత‌లోనే క‌రోనా ప్ర‌భావంతో ఎన్నిక‌లు వాయిదా వేయ‌టంతో ఎత్తులు, పై ఎత్తులు అట‌కెక్కాయి. ఇప్పుడు మ‌రోసారి స్థానిక ఎన్నిక‌ల‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోబోతుంద‌నే స‌మాచారంతో రెండు పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఎవ‌రికి వారే స‌మీక‌ర‌ణ‌లు వేసుకునే ప‌నిలో ప‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల్లో బీసీ మ‌హిళ రిజ‌ర్వుడ్ కావ‌టంతో య‌రగొర్ల ప‌ద్మావ‌తి ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఎంపిక‌య్యారు. ఆమె తండ్రి న‌ర‌సింహం రెండు ద‌శాబ్డాల పాటు నందిగామ గ్రామ స‌ర్పంచిగా చేసి గొప్పపేరు సంపాదించారు. కూతురుపై కూడా అదే అంచ‌నాలు పెట్టుకున్న ప్ర‌జ‌ల‌కు ప‌ద్మావ‌తి కేవ‌లం సంత‌కాల‌కే ప‌రిమిత‌మ‌నేది బ‌హిర్గ‌త‌మైంది. గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న ప‌ద్మావ‌తి కూడా రాజ‌కీయంగా ఎదురైన అనుభ‌వాల‌తో మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. ఒకానొక స‌మ‌యంలో ప‌ద‌విక రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని వినికిడి.


ట్వీ20 మ్యాచ్‌ను త‌ల‌పించేలా ఈ సారి మున్సిపాలిటీ ఎన్నిక‌లు ఉండ‌బోతున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. వైసీపీలో మొద‌టి నుంచి ఉన్న నేత‌ల‌కు ప్రాధాన్య‌త త‌గ్గిస్తున్నార‌నేది వైసీపీలో సాగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌. ఇది కాస్త క్ర‌మంగా అంత‌ర్గ‌త పోరు వ‌ర‌కూ చేరింది. నందిగామ‌లో మంచిప‌ట్టున్న వైసీపీ లీడ‌ర్లు కూడా కొద్దికాలంగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. రాజ‌కీయంగా వైసీపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి, జ‌గ‌న్ ప‌ట్ల పూర్తి న‌మ్మ‌కం ఉన్నా స్థానిక నేత‌ల త‌ప్పిదాలు. ఎమ్మెల్యే సోద‌రుడు అరుణ్‌కుమార్ త‌మ ఎదుగుద‌ల‌ను అడ్డుకుంటున్నాడ‌నే వైసీపీ సీనియ‌ర్ నేత‌ల వ్య‌తిరేక‌త పార్టీను బ‌ల‌హీనంగా మార్చే ప్ర‌మాదం ఉంద‌నేది పార్టీ పెద్ద‌ల అభిప్రాయం. ఈ వ్య‌తిరేక‌త‌ను అవ‌కాశంగా మ‌ల‌చుకునే అవ‌కాశం టీడీపీ శ్రేణుల‌కు ఉన్నా.. అక్క‌డా అంత‌ర్గ‌త గొడ‌వ‌లు గుదిబండ‌లుగా మారాయి. బీజేపీ, జ‌న‌సేన క‌ల‌సి త‌మ వంతు ప్ర‌య‌త్నం కూడా గ‌ట్టిగానే చేయాల‌నుకుంటుంది. క‌మ్మ‌, కాపు, ఎస్సీ, మైనార్టీల ఓట్లు కీల‌కంగా మారిన నందిగామ మున్సిపాలిటీలో ఏ జెండా ఎగుర‌వేయాల‌న్నా.. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోవాల‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. మ‌రి ఇవ‌న్నీ గ‌మ‌నించి.. ఏ పార్టీ నందిగామ పుర‌పాలిక‌పై జెండా ఎగుర‌వేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింద‌నేది మాత్రం అస‌లు సిస‌లైన వాస్త‌వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here