ర‌ఘుప‌తి వెంక‌ట‌ర‌త్నం నాయుడు.. అభినవ విద్యామ‌హ‌ర్షి

ట్యాంక్‌బండ్ వెళ్లిన‌పుడు.. అక్క‌డ కొలువుదీరిన మ‌హ‌నీయుల విగ్ర‌హాల్లోని ఒక విగ్ర‌హం వ‌ద్ద తెలుగు సీమ‌లో బ్ర‌హ్మ‌స‌మాజ కుల‌ప‌తి.బ్ర‌హ్మ‌ర్షి బిరుద సార్ధ‌క విద్యాధిప‌తి. అని రాసి ఉంటుంది. కాస్త త‌లెత్తి పైకి చూస్తే.. నిండైన త‌ల‌పాగా.. చేతి క‌ర్ర‌తో అచ్చతెలుగు నుడికారంగా విగ్ర‌హం ద‌ర్శ‌న‌మిస్తుంది.. ఆయ‌న పేరే ర‌ఘుప‌తి వెంక‌ట‌ర‌త్నం నాయుడు. బ్రిటీష్ ప్ర‌భుత్వం ఇచ్చిన దివాన‌ బ‌హదూర్ బిరుదు ఆయ‌న ఖ్యాతికి అద్దంప‌డుతోంది. కృష్ణాజిల్లా మ‌చ‌లీప‌ట్నంలో పుట్టిన వెంక‌ట‌ర‌త్నం నాయుడు అభిన‌వ విద్యామ‌హ‌ర్షి. ఆడ‌పిల్ల‌కు చ‌దువెందుకు అనే కాలంలో.. తాను ప‌నిచేసే క‌ళాశాల‌లో వారికి ప్ర‌వేశం క‌ల్పించారు. దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి, చ‌లం, ప‌ట్టాభి శీతారామ‌య్య‌, ముట్నూరి కృష్ణారావులు త‌మ గురువు వెంక‌ట‌ర‌త్నంనాయుడు అంటూ స‌గ‌ర్వంగా చెప్పుకునేంత శిఖ‌రం. 1869 అక్టోబ‌రు 1న మ‌చ‌లీప‌ట్నంలో అప్ప‌య్య‌నాయుడు, శేష‌మ్మ దంప‌తుల ఇంట జ‌న్మించా రు. తండ్రి సుబేదార్‌గా ఉద్యోగం చేస్తుండ‌టంతో ఆయ‌న ఉత్త‌ర‌భార‌త‌దేశంలో విద్యాభ్యాసం ప్రారంభించారు.

ఆ త‌రువాత సికింద్రాబాద్ వ‌చ్చాక‌.. నిజాం క‌ళాశాల‌లో చ‌దువు కొన‌సాగింది. మ‌ద్రాసు క్రిస్టియ‌న్ క‌ళాశాల‌లో పీజీ పూర్తిచేశారు. ఇంగ్లిషు అధ్యాప‌కుడుగా బోధ‌న వృత్తిలోకి వ‌చ్చిన ఆయ‌న‌.. కుల‌, మ‌తాల‌కు అతీతంగా మాన‌వులంతా ఒకటే అనే స‌మ‌భావ‌న‌కు బీజం వేశారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాంతాల్లోని ప‌లు క‌ళాశాలల ప్రిన్సిపాల్‌గా ప‌నిచేసిన వెంక‌ట‌ర‌త్నం నాయుడు చివ‌రిలో మ‌ద్రాసు విశ్వ‌విద్యాల‌యం వైస్‌ఛాన్స‌ల‌ర్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆయ‌న భావ‌న‌లు.. గొప్ప‌గా ఉండేవి. స‌మాజాన్ని న‌డిపించేందుకు ప‌రిణితి చెందిన యువ‌త కావాల‌నే ఆశ‌యానికి త‌గిన‌ట్టుగా తాను న‌డ‌చుకునేవారు. త‌న విద్యార్థుల‌ను కూడా న‌డిపించేవారు. సృష్టిక‌ర్త ఒక్క‌రే.. అంద‌రినీ న‌డిపించేది ఒక్క‌టే అనే స‌మాన‌త్వ భావ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను గొప్ప‌గా తీర్చిదిద్దాల‌నే త‌లంపుతో బ్ర‌హ్మ‌స‌మాజం బీజం వేసింది కూడా ఆయ‌నే.

అటువంటి మ‌హ‌నీయుడు.. 1917లో తొలిసారిగా తెల‌గ‌, నాయుడు కుల సంఘ స‌మావేశానికి వెళ్ల‌ట‌మే పెద్ద త‌ప్పిదంగా ఆయ‌న శిష్యులు భావించారు. కుల‌, మ‌తాల‌కు అతీతంగా గురువు ఇలా మార‌టాన్ని భ‌రించ‌లేక క్ర‌మంగా దూర‌మ‌వుతూ వ‌చ్చారు. కేవ‌లం తెల‌గ కుల‌సంక్షేమ‌మే ఆయ‌న చూసుకున్నాడ‌నే అప‌వాదును ఆయ‌న‌పై రుద్దిన‌వారూ ఉన్నారు. కానీ.. ఒక విద్యావేత్త‌గా.. సంస్క‌ర్త‌గా వెంక‌ట‌ర‌త్నంనాయుడు సేవ‌లు నిరుప‌మానం. బ్రాహ్మ‌ణేత‌రుల కులాల‌కు సంబంధించిన జ‌స్టిస్ పార్టీలో ఆయ‌న కీల‌కం. తెల‌గ కుల సంఘ అధ్య‌క్షుడుగా ఉన్నా ఆయ‌న‌.. ఇది త‌న వ్య‌క్తిగ‌త‌మంటూ చెప్పినా పెడ‌చెవిన పెట్టారు. అయినా బ్ర‌హ్మ‌ర్షిగా శిష్యుల్లో.. స‌మాజంలో ఆయ‌న కీర్తి వెలుగొందింద‌నే చెప్పాలి.

డిగ్రీ చ‌దువుతుండ‌గానే 1884లో ర‌ఘుప‌తి వెంక‌ట‌ర‌త్నం నాయుడుకు వివాహ‌మైంది.. కొద్దికాలానికే ఆమె మ‌ర‌ణించారు. అప్ప‌టి నుంచి తాను ఒంట‌రిగానే జీవ‌న‌ప్ర‌యాణం కొన‌సాగించారు. తెల్ల‌టి వ‌స్త్ర ధార‌ణ‌తో క‌నిపించేవారు. కానీ చివ‌రి రోజుల్లో కాకినాడలోని తాను స్థాపించిన ఆశ్ర‌మంలోనే 1939 మే 26న అర్ధ‌రాత్రి .. శిష్యుల మ‌ధ్య‌నే ఉంటూ.. వారిప‌ట్ల ఆరాధ‌న భావంతో
చూస్తూనే రెప్ప‌వాల్చారు. ద‌శాబ్దాలుగా తెలుగు వారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఆయ‌న చివ‌రి కోరిక ఏమిటో తెలుసా.. త‌న భార్య ఛాయాచిత్రాన్ని త‌న‌తోపాటు ద‌హ‌నం చేయ‌మంటూ కోర‌ట‌మే. నిజంగా ఎంత గొప్ప వ్య‌క్తిత్వం. రాముడుని మించిన ఔన్య‌త్యంగానే తెలుగువారి మ‌న‌సులో ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here