ప్రకృతి వైపరీత్యాలు.. భూమ్మీద మానవుల ఉనికిని ప్రశ్నార్ధంగా మార్చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించు కునేందుకు మానవ పరిణామ క్రమం నుంచి అణ్వాయుధాలు సమకూర్చునేంత వరకూ జరుగుతూనే ఉంది. సరిహద్దు వివాదాలతో లక్షల కోట్లు ఖర్చుచేసి మరీ క్షిపణులు, అణ్వాయుధాలు నిల్వ చేసుకుంటున్న దేశాలెన్నో. మరోవైపు ఆకలితో అలమటిస్టూ మట్టితిని బతుకీడచ్చే సోమాలియా, మంగోలియా వంటి కడు పేదదేశాలు ఇంకెన్నో.. ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించటం వల్ల తలెత్తిన ఇబ్బందులే. భవిష్యత్ మానవ మనుగడను సవాల్ చేస్తున్న అంశాలే. ఏదైనా ప్రకృతి ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. దానికి అనుగుణంగా నడుచుకున్నపుడు మాత్రమే మనుగడ కొనసాగుతుంది. కానీ.. ఇప్పుడు అదే మనిషి.. ప్రకృతిని కూడా జయించాలనే దుర్బుద్దితో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. అడవులు, సముద్రాలు, ఆకాశాన్ని గెలిచానంటూ విర్రవీగుతున్నాడు. చెరువులు, నదీనదాలు, సముద్రాల అడుగున తవ్వి సొమ్ము చేసుకుంటున్నాడు. గ్రహాలపై అన్వేషణకు ఎంతో ప్రయాస పడుతున్నాడు. ఇవన్నీ పురోగతి వైపు ప్రయాణిస్తున్నాడనేందుకు సంకేతాలే. కానీ.. అదే సమయంలో ప్రళయానికి తానే మార్గం వేస్తున్నాడనే అంశాన్ని మరచిపోతున్నాడు. ఇదే ఇప్పుడు 850 కోట్ల జనాభాను ప్రమాదపు అంచుకు నెట్టేస్తోంది.
కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ను చూస్తే నిజంగానే ప్రళయం సంభవించబోతుందా అనే అనుమానాలు వస్తాయి. ఒకప్పుడు మంచినీటి చెరువుగా లక్షలాది మంది దాహార్తి తీర్చిన హుస్సేన్‌సాగర్ ఇప్పుడు కాలుష్య కాసారంగా మారింది. వేలాది చెరువులు
ఇళ్ల స్థలాలుగా మారాయి. ఇప్పుడు అదే వరదలతో జనజీవనం స్తంభించటానికి కారణం. పాలకులు కూడా తాత్కాలిక మరమ్మత్తులతో కాలయాపన చేస్తున్నారు. కానీ
సకల ప్రపంచం లయమయ్యే లక్షణం ప్రళయమంటారు. స్కాంధపురాణంలోని రేవాకాండలో చెప్పిన వాక్యాలు ఇప్పుడు అక్షర సత్యాలు “మర్త్యలొకే జనాస్సర్వే నానాక్లేశ సమన్వితాః నానాయోని సముత్పన్నాహః పచ్యంతే పాపకర్మభిః
ప్రపంచం మొత్తం అతలా కుతలమౌతోంది. కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఒకవైపు కుదిపివేస్తోంది. చిన్న, పెద్ద, ధనిక, పేద, పండిత, పామర, స్వ పర భేదం లేకుండా ఎన్నో లక్షల నిండు ప్రాణాలను బలిగొంటోంది. ఆస్ట్రేలియా లో లక్షలాది హెక్టార్ల అడవులు, జంతువులు నష్టంచేసిన అగ్నికీలలు ఇప్పుడు అమెరికాను దహించి వేస్తున్నాయి. విమాన, రైలు, రహదారి వాహనాల ప్రమాదాలు, పడవ ప్రమాదాలు ఎన్నో జీవితాలను బలిగొంటున్నాయి. కొండచర్యలు విరిగి పడుతున్నాయి. భూప్రకంపనలు ప్రజలను భయభీతులను చేస్తున్నాయి. ఇవన్ని ఒక వైపు మానవాళికి వణుకు పుట్టిస్తుంటే పైశాచిక స్వభావాలు మాత్రం మనుషులను వీడడంలేదు. అత్యాచారాలు మితి మీరి పోతునాయి. టీవీ తెరిస్తే అఘాయిత్యాలు, హత్యలు వినలేని వార్తలు రాక్షస కృత్యాలకు నిలువెత్తు నిదర్శనాలు. నడిరోడ్డుపై కాల్పులు, ఇంట్లోకి దూరి పెళ్లికావాల్సిన ఆడపిల్లల కుత్తుకలు తెగనరకటాన్ని ఏమనాలి.
వీటన్నిటికి కారణం ఏమిటి అని ఎవరైనా అంతరాత్మను ప్రశ్నిచుకుంటున్నారా? స్కాంధ పురాణంలో చెప్పినట్టు నిస్సందేహంగా మానవ పాపకర్మలే కాదా? జల ప్రళయం కూడా వెంటాడుతోంది కదా! వీటన్నిటికీ ఉపశమనం కేవలం సత్ప్రవర్తన. సదాచారం. యజ్ఞ యాగాదులే చేయాలని నియమం లేదు. తోటి జీవిని జీవిగా గుర్తించుదాం. సోదరులుగా మెలుగుదాం. మనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానజ్యోతిని సందర్శిద్దాం. కొంత సమయాన్ని ఆత్మావలోకనం కోసం కేటాయిద్దాం. ఇది కేవలం మానవ ప్రయత్నమే. ఆ పిదప భగవంతుణ్ణి లోక కల్యాణం కోసం ప్రార్థిద్దాం. ఏమంటారు.. ఒక్కసారి నెమ్మదిగా కళ్లుమూసుకుని మనసారా ఆలోచించండీ. అంతరాత్మలోకి ఒక్కసారి తొంగిచూసి మీతో మీరే మాట్లాడుకోండి. అక్కడే సమాధానం దొరుకుతుంది.
రేపటి ప్రపంచాన్ని అందంగా మలిచేందుకు మార్గమూ కనిపిస్తుంది.
బొల్లేపల్లి జగన్నాథాచార్యులు – విశ్లేషకులు