మంత్రి పేర్ని నానిపై దాడి రాజకీయ దుమారం రేకెత్తిస్తోంది. ఒక మంత్రిపై ఇంట్లోనే హత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. ఏడేళ్లుగా ఏపీలో రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. కులం, మతం రంగుతో ప్రతీకారాలు, కక్షసాధింపులకు కేరాఫ్ చిరునామాగా మారాయి. ఐదేళ్ల ఏలుబడిలో టీడీపీ సాగించిన దురాగతాలను వైసీపీ గట్టిగానే ఎదుర్కొంది. అధికారం చేపట్టాక దానికి తగినట్టుగానే ఎదురుదాడులకు దిగుతుందనే అపవాదు వైసీపీ భరించాల్సి వస్తోంది. శాంతిభద్రతల విషయంలో కటవుగానే ఉంటున్నామని చెబుతున్నా తరచూ సంఘటనలు ప్రభుత్వ ప్రతిష్ఠకు సవాల్ విసురుతున్నాయి. తాజాగా మంత్రి పేర్ని పై బుడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి దాడి చేశాడు. ఇదంతా మద్యం మత్తులో చేసిన దాడంటూ మొదట అనుకున్నారు. కానీ.. తాఫీ పనిచేసే అతడు.. హత్యాయత్నానికి ఉపయోగించిన తాపీ కూడా పదను ఉంది. పైగా ఆ రోజు పేర్ని తల్లి దశదిన కర్మ కావటంతో అందరూ బిజీగా ఉన్నారు.
అటువంటి సమయంలో నాగేశ్వరరావు ముందుగానే రెక్కీ నిర్వహించినట్టుగా ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు. అయితే.. నిందితుడి అక్కడ టీడీపీ కీలక నేత కావటం. ఆమె.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అనుచరురాలు కావటంతో ఇది రాజకీయ రంగు పులుకుముంది. దీంతో అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేపట్టారు. కొల్లు రవీంద్రను కూడా విచారించేందుకు నోటీసులు జారీచేశారు పోలీసులు . ఇప్పటికే కొల్లు రవీంద్రపై వైసీపీ కార్యకర్త హత్యలో నిందితుడుగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కొల్లు చుట్టూ కేసులు చుట్టుకోవటం టీడీపీలోను గుబులు పుట్టిస్తోంది. నిందితుడి కాల్ డేటా పరిశీలించిన పోలీసులు కూడా దీని వెనుక ఎవరో ఉన్నారనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ఇంత పకడ్బందీగా ఒక మంత్రిపై దాడికి పాల్పడేందుకు పురిగొల్పిన తమ్ముళ్లు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కృష్ణా రాజకీయాలు మాంచి వేడి మీదున్నాయి. ఇప్పుడు.. పేర్నిపై హత్యాయత్నంలో మరింతగా వేడెక్కుతున్నాయి.