ఆ రెడ్లు… ఈ రెడ్ల‌ను సాగ‌నంపారా!

తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ నేత‌లు దూర‌మ‌వుతున్నారు. ఏపీలో ప‌ట్టిన గ‌తే టీఎస్‌లోనూ త‌ప్ప‌దంటూ మ‌రీ బ‌య‌ట‌కు వెళ్తున్నారు. విజ‌య‌శాంతి పార్టీ వీడిన‌పుడు ఆమె వ‌ల్ల పెద్ద‌గా న‌ష్టం ఏమిలేద‌న్నారు. ఇప్పుడు అదే బాట‌లో చాలామంది హ‌స్తం సీనియ‌ర్లు పార్టీ వీడ‌వ‌చ్చ‌నే ప్రచారానికి బ‌లం చేకూరేలా కోమ‌టిరెడ్డి రాజ‌గోల‌పాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పీసీసీ అధ్య‌క్షుడుగా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నాయ‌క‌త్వాన్ని ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న వారిలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. 2018 ఎన్నిక‌ల్లోనూ ఉత్త‌మ్ తీరును ఎండ‌గ‌ట్టారు. శ‌ల్య‌సార‌థ్యంలో హ‌స్తం వెనుక‌బ‌డ‌టం గ్యారంటీ అంటూ ఎద్దేవాచేశారు. త‌మ‌కు పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే పార్టీను అధికారంలోకి తీసుకువ‌స్తామంటూ ధీమా వ్య‌క్తంచేసారీ బ్ర‌ద‌ర్స్‌.

కానీ పీసీసీ పీఠం రేవంత్‌కు ఇస్తామ‌నే హైక‌మాండ్ మాట‌తో కోమ‌టి రెడ్డి సోద‌రులు పార్టీ వీడాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. ముందుగా రాజ‌గోపాల‌రెడ్డి బీజేపీ కండువా క‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల వెంక‌ట‌రెడ్డి కూడా బీజేపీ మంత్రి నితిన్ గ‌డ్క‌రీను క‌లిశారు. రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు అభినంద‌న‌లు చెప్పేందుకు వెళ్లానంటూ చెబుతున్నా దాని వెనుక పార్టీ వీడే సంకేతాలే నంటూ ఆ పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ఇప్ప‌టికే న‌ల్ల‌గొండ జిల్లా సీనియ‌ర్ నేత‌.. పెద్ద‌లు జానారెడ్డి కుటుంబం కాషాయ కండువా క‌ప్పుకుంటుందంటూ ప్ర‌చారం ఊపందుకుంది. రాబోయే నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌పై బీజేపీ దృష్టిసారించింది. అక్క‌డ గెలుపు ద్వారా 2023 నాటికి బీజేపీ తెలంగాణ‌లో జెండా ఎగుర‌వేసేందుకు వ్యూహ ర‌చన చేస్తోంది. ఇటువంటి వేళ కీల‌క నేత‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ హ‌స్తం పార్టీ వీడ‌టం ఊహించ‌ని షాక్ అనే చెప్పాలి. ఆ ఇద్ద‌రూ పార్టీ మారేందుకు ఉత్త‌మ్ నాయ‌క‌త్వంపై ఉన్న అల‌కే అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. వీరే ఇలా ఉంటే.. వీహెచ్‌, భ‌ట్టి విక్ర‌మార్క, దామోద‌ర రాజ‌న‌ర్సింహ వంటి సీనియ‌ర్లు ఇంకెంత గుర్రుగా ఉంటార‌నేది పార్టీలో మ‌రో చ‌ర్చగా మారంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here