నానీల త్ర‌యానికి జ్ఞానోద‌య‌మైన‌ట్టేనా!

ఏపీలో నిన్న‌టి వ‌ర‌కూ కేశినేని, దేవినేని, య‌ర‌ప‌తినేని, చింత‌మ‌నేనిల హ‌వా న‌డిచింది. సైకిల్‌కు పంక్స‌ర్ కావ‌టంతో వారంతా మాజీలుగా మారి… మ‌ళ్లీ బిజినెస్ ప‌నుల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు.. నేనిల బాధ్య‌త నానీలు తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావ‌టంతో ఆళ్ల నాని, కొడాలి నాని, పేర్ని నానిల‌దే హ‌వా అంతా అన్న‌ట్టుగా సాగుతోంది. ఒక‌రు న‌టిస్తే.. మ‌రొక‌రు జీవిస్తున్నారు. మూడో నేత న‌ట విశ్వ‌రూపంతో బూతుల నానిగా పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్నారు. వాస్త‌వానికి కృష్ణా, గుంటూరు జిల్లాలో మాట‌కు ముందు.. మాట త‌రువాత ఒక బీప్ ఉండాల్సిందే. కానీ.. వీళ్లు నాలుగు ఆకులు ఎక్కువే లెక్క‌బెట్టారు కాబ‌ట్టి.. ప‌ద్నాలుగు తిట్టు ఎక్కువే తిడ‌తారు. పేర్ని నాని.. వార‌సుడుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కాపు వ‌ర్గ నేత‌. తండ్రి కి త‌గిన త‌న‌యుడుగా పేరు పొందినా.. ఏడాదిన్న‌ర కాలంలో త‌న ఓవ‌రాక్ష‌న్‌తో ఏపీలో ప‌లుచ‌న అయ్యారు. పైగా కాపు వ‌ర్గీయుల వ్య‌తిరేక‌త‌ను చ‌విచూస్తున్నారు. ప‌వ‌న్ నాయుడు అంటూ జ‌న‌సేనానిపై విమ‌ర్శ‌లు కురిపిస్తూ.. అధినేత ఆశీర్వ‌చ‌నాలు పొందుతున్నారు. అదే స‌మ‌యంలో త‌న వ‌ర్గానికి దూర‌మ‌వుతున్నాన‌నే విష‌యాన్ని మ‌రిచారు. ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌కు కొన‌సాగింపుగా పేర్ని అందిపుచ్చుకున్నారు. జ‌ర్న‌లిస్టుల‌కు వెన్నంటి ఉంటానంటూ.. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన హెల్త్ కార్డుల కూడా ఇప్పించ‌లేదు. ఇళ్ల స్థ‌లాల సంగతి అడిగినా ప్ర‌యోజ‌నం లేద‌నే ఉద్దేశంతో జ‌ర్న‌లిస్టులు కూడా వ‌దిలేశారు. కాకా హోట‌ళ్ల‌లో టిఫిన్లు.. రోడ్డెంట సోడాలు తాగుతూ మీడియా ఎదుట బాప్‌ర్‌.. మ‌న పేర్ని న‌ట‌విశ్వ‌న‌టుడు అనుకునేంత పాపులారిటీ సంపాదించారంటూ విప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నాయి.

మ‌రో మంత్రి వ‌ర్యులు కొడాలి నాని.. అప్పుడు దేవుళ్ల విగ్ర‌హాలు ప‌గుల‌గొడితే ఏమైందీ.. ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు పోస్తే కొత్త విగ్ర‌హాలు వ‌స్తాయంటూ.. త‌న‌కు సెంటిమెంట్స్ లేవ‌నే స్ట‌యిల్‌లో హిందువుల న‌మ్మ‌కాల‌ను చాలా చుల‌క‌న చేస్తూ మాట్లాడారు. ఇటీవ‌ల జ‌న‌సేనాని గుడివాడ ప‌ర్య‌ట‌న‌లో బోడి లింగం అంటూ దెప్పిపొడుస్తూ నానీల‌పై విరుచుకుప‌డ్డారు. పాపం.. దీన్ని జీర్ణించుకోలేని నాని తానే గొప్ప సంఘ‌సంస్క‌ర్త అనేంత బిల్డ‌ప్ ఇచ్చారు. కానీ.. రెండ్రోజుల త‌రువాత‌.. గుడివాడ‌లో పేకాక్ల‌బ్‌ల‌పై స్పెష‌ల్ పోలీసుల దాడుల‌తో బిక్క‌ముఖం పెట్టాడు. త‌న ఇలాఖాలో పేకాట లేదంటూ బొంకిన అమాత్యులు ఇప్పుడు.. పేకాడితే ఏమైందీ.. పోలీసులు కేసులు.. ఫైన్లు.. ఇందులో ఏమైనా త‌ప్పుందా అంటున్నాడు. ప‌వ‌న్‌ను చుల‌క‌న చేస్తూ మాట్లాడి నీతివంతుడుగా క‌బుర్లు చెప్పిన నాని గారి పేకాట క్ల‌బ్బులు ఇప్పుడు బ‌ట్ట‌బ‌య‌లు కావ‌టంతో సంజాయ‌షీ చెప్పుకునేందుకు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు ప‌రుగులు తీశార‌ట‌. మ‌రోనాని.. ఈయ‌న గారు కూడా మంత్రివ‌ర్యులు.. ఆరోగ్య‌మంత్రిగా తానే గొప్ప అనుకుంటూ గ‌డిపేస్తున్నారు. అవ‌కాశం చిక్కిన‌పుడు హ‌డావుడి చేస్తూ.. క‌నిపిస్తుంటారు. ఇంత‌గా పెత్త‌నం చెలాయిస్తూ.. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కేబినేట్‌లో అంతా తామే అనుకునే నానీల త్ర‌యానికి ఇప్పుడిపుడే జ్ఞానోద‌యం అవుతుంద‌ట‌. మ‌రి ఇదంతా అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఫ‌లిత‌మ‌నేన‌ని తెలుస్తోంది. ఏపీలో కీల‌క‌మైన కాపు సామాజిక‌వ‌ర్గ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అంటే విధేయ‌త చూపేవారు. ఆయ‌న వారసుడిగా జ‌గ‌న్ ప‌ట్ల కూడా అదే భావ‌న చూపారు. కానీ.. ఇటువంటి నానీల వ‌ల్ల ఒక కులం వైసీపీకు దూర‌మ‌వు తుంద‌నే విష‌యాన్ని గ్ర‌హించిన జ‌గ‌న్ ముగ్గురు నానీల‌కు గ‌ట్టిగానే క్లాసు పీకిన‌ట్టుగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here