ఏపీలో వైసీపీ సర్కార్ తీరు టీడీపీ నేతలకు చుక్కలు చూపుతోంది. రెండేళ్ల క్రితం వరకూ మందీమార్బలం.. ఎక్కడకు వెళ్లినా రెడ్ కార్పెట్ పరచిన అధికారగణం. ఇప్పుడు జగన్ దెబ్బకు దిక్కులు చూస్తున్నారు. ఏ వైపు నుంచి ఏ విధంగా నరక్కు వస్తారనే ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు అరెస్ట్. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై అగంతకుల దాడితో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. లోకల్ ఎన్నికల సమయంలో ఎదురైన అవకాశాన్ని సానుభూతిగా మలచుకుందామనే ఆలోచన మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. 2004లో సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నక్సల్స్ దాడి జరిపితేనే.. జనం సానుభూతి చూపలేకపోయారు. అటువంటిది ఇప్పుడు నేతలు.. అందులోనూ ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నపుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా పెత్తనం చేసిన నేతలపై దాడి జరిగినా.. కేసులు పెట్టి జైల్లో పెట్టినా జనం స్పందిస్తారా అంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవాచేస్తున్నాయి.
నిజమే.. కేవలం ఒక కులం చేతిలో ఉన్న ఏపీను బయటకు తీసి.. కింద కులాలకూ చేయూతనిచ్చారనే అభిప్రాయం వైసీపీ సర్కారుపై బలంగా ఉంది. అయితే.. లోకల్ నేతలు, కొందరు ఎంపీ, ఎమ్మెల్యేల వల్ల జగన్ ప్రతిష్ఠకు దెబ్బ తగులుతుందనే భావన పార్టీ వర్గాల్లోనూ లేకపోలేదు. అయితే.. ప్రస్తుతం లోకల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అనే భావన వైసీపీ తీసుకు వస్తోంది. మరోవైపు టీడీపీ కూడా పరవు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘాన్ని వాడుకుంటుందనే ఆరోపణలూ లేకపోలేదు. జనసేన, బీజేపీ ప్రభావం ఎంత వరకూ ఉంటుందనేది ఎవ్వరూ అంచనావేయలేకపోతున్నారు. అయితే వైసీపీకు పోలయ్యే ఓట్లను మాత్రం జనసేన చీల్చుకునే అవకాశం ఉందనేది విశ్లేషకులు అంచనా. ఎటుచూసినా టీడీపీ మాత్రం అడుగడుగునా సవాళ్లతో ఎన్నికలను చవిచూస్తోంది. వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీనే ప్రధాన ప్రత్యర్ధిగా భావించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. దీనిలో అధికశాతం విజయం సాధించనే చెప్పాలి. పైగా లోకల్ ఎన్నికలు అధికార పార్టీకు అనుకూలంగానే ఉంటాయనేది గతం నుంచి వస్తున్న ఆనవాయితీ. కాబట్టి.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఏదో నష్టపోతుందని ప్రతిపక్షాలు లెక్కలు కట్టుకోవటం నేతిబీర నేయి చందం అంటున్నారు వైసీపీ నేతలు.