గెలుపోటములు సంగతి ఎలా ఉన్నా.. ఏపీ పంచాయతీలో రచ్చ ఏ పార్టీ పరవు తీస్తుందనే చర్చ మొదలైంది. ఇప్పటికే వైసీపీ సర్కార్ వర్సెస్ అన్నట్టుగా గొడవ ముదిరి పాకాన పడుతోంది. ఎన్నికల సంఘం రూపొందించిన ఈ-వాచ్ యాప్‌పై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. తాము గెలవగలమనే సత్తా ఉన్నపుడు వైసీపీ ఎందుకిలా ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తుందంటూ ప్రశ్నిస్తోంది. బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉన్నట్టుగా కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా లేకపోవటం ఆందోళనకు గురిచేస్తుందనేది ఆ పార్టీ పెద్దల ఆందోళన. వాస్తవానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే.. దాని వైపే స్థానిక, పురపాలక, ఎంపీటీసీ, జడ్పీ ఎన్నికల్లో జనం ఉంటారనేది గతం నుంచి వస్తున్న ఆనవాయితీ. కానీ టీడీపీ మాత్రం.. ఇటీవల ఏపీలో వరుస సంఘటనలు తమకు అనుకూలంగా ఉంటాయని.. వైసీపీ పట్ల జనం వ్యతిరేకంగా ఉన్నారనేది ఎక్కువగా అంచనా వేసుకుంటోంది. పైగా.. నిమ్మగడ్డ వంటి ఎన్నికల అధికారి అండదండలను కూడా గుడ్డిగా నమ్ముతుందంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే తమలోని లోపాలను పక్కనబెట్టి.. తమదే విజయం అనేంత ధీమాగా ఉన్నారు. పల్లెల్లో పట్టు సాధించటం ద్వారా రాబోయే జడ్పీ, మున్సిపాలిటీ ఎన్నికలను అవలీలగా అధిగమించాలనే ఎత్తులు వేస్తున్నారు. ఈ లెక్కన. ఏ పార్టీ పరవు పోగొట్టుకుని నవ్వుల పాలవుతుందనేది ఆసక్తిగా మారింది. బీజేపీ, జనసేన గెలుపోటములను పెద్దగా పట్టించుకోకున్నా.. టీడీపీ, వైసీపీ వంటి ప్రధాన పక్షాలకు ఇది జీవన్మరణ సమస్యగానే మారిందనే చెప్పాలి.



