తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ పాలనకు రిఫరెండంగా భావిస్తుందా! పార్టీ జెండా పీకేయటమే అనే విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ గెలిచేందుకు పాచికలు వేస్తుందా! హిందుత్వ భావనకు ఏపీలో పాగా వేయాలనే ఎత్తుగడకు బీజేపీ తిరుపతి ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుందా! జనసేనకు ఉన్న బలం ఈ ఎన్నిక ద్వారా నిరూపించుకోవాలని చూస్తుందా! ఔను.. ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో కాకలు పుట్టిస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్ బరిలో సత్తా చాటుకున్న వైసీపీ తిరుపతి ఎన్నికలో తమ అభ్యర్థి గురుమూర్తి ఎంపీగా గెలవటం పక్కా అనే ధీమాగా ఉంది. పైగా అధికారంలో ఉన్నారు. మందీమార్బలం అందరూ అండగా నిలుస్తున్నారనే ధీమా జగన్ మోహన్‌రెడ్డిలో ఉంది. అందుకే. ఈ నెల 14న తిరుపతి ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తిని కారణంగా చూపుతూ వాయిదా వేశారంటోంది టీడీపీ. బీజేపీ, జనసేన మైత్రి ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనే భయం మొదట్లో ఆ పార్టీ నేతల్లో కనిపించినా క్రమంగా ఇరు పార్టీ కార్యకర్తలు, నేతలు కలిసే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి బరిలో నిలవటం కాస్త అనుకూలిస్తోంది. కానీ.. టీడీపీ , బీజేపీ కోట్లాడుకోవటం వల్ల చీలే ఓట్లు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఎవ్వరికీ సొంతం గాకుండా ఉంటాయి. ఇది వైసీపీకు మరింత అనుకూలంగా మారుతుందని అంచనా వేసుకుంటుంది. మరో వైపు గాజుగ్లాసు గుర్తు ఓ పార్టీకు చెందిన అభ్యర్థికి ఎన్నికల సంఘం కేటాయించటం కలవరం కలిగిస్తుంది. గతంలో తెలంగాణ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు.. టీఆ ర్ ఎస్ అభ్యర్థులను ఘోరంగా ఓడించింది. ఇప్పుడు అక్కడ కూడా గుర్తు కలవరం పెడుతుంది. ఎటుచూసినా వైసీపీ గెలుపు పక్కా అనే ఉన్నా.. తిరుపతి ఓటర్లు ఎలా స్పందించబోతున్నారనేది అంచనాలకు అందకుండా ఉంది. దుబ్బాకలో బీజేపీ గెలవటం.. నాగార్జునసాగర్‌లో టీఆర్ ఎస్ గుబులు. ఏపీలోనూ అధికార వైసీపీ కూడా ఇదే రకమైన ఇబ్బంది ఎదుర్కొంటుందని అంచనాలున్నాయి. మరి.. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లు ఎవర్ని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తారనేది సస్పెన్స్.