ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నిసార్లు దిల్లీ వెళ్లినా ఏదో సాకులు వెతుకుతుంటారు ప్రత్యర్థులు. అదే అప్పట్లో దిల్లీ నుంచి చైనా వరకూ చుట్టొచ్చిన చంద్రబాబు యాత్రలు మాత్రం రాష్ట్రం కోసమంటూ తెగ ప్రచారం చేశారు. నిజమే.. అప్పట్లో బాబు చక్రం అలాగే తిరిగేది. అమెరికాలో ట్రంప్ కూడా బాబు వస్తున్నాడని తెలియగానే తన పర్యటనలు రద్దు చేసుకునేవారట. చైనాలో అయితే ట్రాఫిక్ జామ్‌లు. మలేషియా , సింగపూర్‌లో అయితే అబ్బో .. పోన్లే కాసేపు బాబును పక్కనబెడదాం.. జగన్ సీఎంగా ధిల్లీ వెళ్లటం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జగన్ రెండో రోజు దిల్లీ పర్యటన. పెద్దలను కలుస్తున్నారు.. వెంకన్న చిత్రపటం ఇచ్చి సన్మానాలు చేస్తున్నారు. ఇదంతా తన కోసం కాదు. ఏపీకు అవసరమైన నిధులు, చల్లని చూపులు కోసమే. అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన నరేంద్రమోదీతో విశాఖరాజధానిగా ఓకే చేయించుకోవటం కూడా దానిలో దాగుంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమంటూ ఏ నాడో కేంద్రం చేతులు దులిపేసుకుంది. పోలవరం నిధులు రూ.55 కోట్లు కావాలంటే.. అబ్బే.. మీ పాత సీఎం మాకు నిధులు చాలంటూ రాసిన ఉత్తరం చూపుతున్నారు. మీ పోలవరం మీరే కట్టుకోవాలంటూ ఏ నాడో తేల్చారు. ఇప్పటికే నవరత్నాలతో జనం ఉచితానికి బాగా అలవాటుపడ్డారు. ఎన్నికలు మరో మూడేళ్లున్నాయి. కాబట్టి నష్టమొచ్చినా కూడా అప్పటి వరకూ ఉచిత పథకాలు నడిపించాలి. కాబట్టి దానికోసం అప్పులు చేయాలి.. కేంద్రం అనుమతులు కూడా రావాలి. మూడో సమస్య రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న సీబీఐ అలజడి. సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆర్ ఆర్ ఆర్ వేసిన పిటీషన్ ఇప్పుడు వైసీపీను కూడా వణికిస్తుంది. కేంద్రంలో బీజేపీ సహకరించకపోతే.. బెయిల్ రద్దు కావచ్చనే ఊహాగానాలు కూడా వైసీపీ శ్రేణుల్లో ఉన్నాయి. కాషాయ పెద్దలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా ఏదో విధంగా బయటపడవచ్చనే సలహాదారుల సూచనలు కూడా దిల్లీ యాత్రకు కారణమనే గుసగుసలూ లేకపోలేదు. మరి జగన్ యాత్ర సక్సెస్ అయినట్టేనా…
పెద్దలు సమ్మతి తెలిపినట్టేనా!



