మాజీ మంత్రి.. టీడీపీ ఫైర్‌బ్రాండ్ అచ్చెన్నాయుడు అయోమయంలో పడ్డారట. టీడీపీ అధ్యక్ష పదవి.. మందీమార్బలం.. కూడబెట్టిన సొమ్ములు ఇవేమీ.. తనను జైలు జీవితం నుంచి తప్పించలేకపోయాయంటూ వైరాగ్యంలో ఉన్నారట. నిజమే.. నిన్నటి వరకూ తిరుగులేని నేతగా.. మకుటం లేని మహారాజుగా చెలామణీ అయిన అచ్చెన్నకు ఇది ఊహించని పరాభవం. ఈఎస్ ఐ కుంభకోణంలో అచ్చెన్న పాత్ర ఎంత వరకూ ఉంది.. నిజంగానే కోట్లు కుమ్మేశారా! అనుచరులకు సహకరించారా! అధినేత ఆదేశాలను అమలు చేశారా! చినబాబు వల్ల చిక్కుల్లో పడ్డారా! ఇవన్నీ ఏసీబీ విచారణలో తేలాల్సి అంశాలు. ఏమైనా టీడీపీలో కీలకనేత.. నీతికి మేమే కేరాఫ్ చిరునామా అని జబ్బలు చరచుకుని మరీ చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మంత్రి వర్యులకు ఇలాంటి పరాభవాలు బాగానే దెబ్బేసినట్టున్నాయి. లేకపోతే.. ఎప్పుడూ వైసీపీ అంటే ఒంటికాలిపై లేచి గర్జించే ఆ నోరు ఎందుకిలా మౌనంగా మారుతుందనేది కూడా తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు పోయిన సారి కాపు కార్డు వాడిన టీడీపీ.. ఈ సారి బీసీ కార్డు వాడదామనుకుంటే.. అచ్చెన్న మౌనం.. షాక్‌గా మారిందట.
అసలేం జరుగుతోంది.. నాకు తెలియాలంటూ.. చంద్రబాబు అనుచరులకు ఆదేశాలిచ్చారట. సిక్కోటు జిల్లా అంటేనే తెలుగుదేశం అడ్డా. ఏ పార్టీ కార్యక్రమమైనా అక్కడ నుంచే మొదలు. ఇప్పటి వరకూ టీడీపీ కంచుకోటగా భావిస్తూ వచ్చారు. కానీ అక్కడ వైసీపీ పాగా వేయటం. తమ్మినేని శీతారాం స్పీకర్‌గా వావా నడుపుతున్నారు. ధర్మాన కృష్ణప్రసాద్ డిప్యూటీ సీఎంగా జిల్లాపై మంచి పట్టు సాధిస్తున్నారు. మంత్రిగా బొత్స సత్యనారాయణ ప్రాభల్యం ఉండనే ఉంటుంది. ఇవన్నీ టీడీపీను బలహీనంగా మార్చాయి. ఇటువంటి సమయంలోనే అచ్చెన్న అరెస్టు కావటం పసుపుగూటిని మరింత గుబులుకు గురిచేసింది.
అచ్చెన్న అరెస్ట్ సమయంలో టీడీపీ నేతల నుంచి ఆశించినంత మద్దతు రాలేదనే భావన కూడా అచ్చెన్నలో ఉందట. కేవలం బీసీ నేత కావటం.. ఈ వ్యవహారంలో చినబాబు ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందనే అంశం బయటకు వస్తుందనే భయంతోనే తనను ఒంటరి చేశారంటూ అచ్చెన్న అనుచరుల వద్ద వాపోయారనే ప్రచారం జరిగింది. మరోవైపు ఎంపీ రామ్మూర్తినాయుడు బీజేపీలోకి
చేరతారనే అంశం కూడా తెరమీదకు వచ్చింది. నాలుగేళ్లపాటు వైసీపీతో పోరాటం చేస్తూ కేసుల్లో ఇరుక్కోవటం కంటే మౌనంగా ఉండటమే మేలనే భావనలో యువ ఎంపీ రామ్మూర్తినాయుడు వచ్చేశారట. అందుకే.. బాబాయిను కూడా సైలెంట్‌గా ఉండమని సూచించారట. ఇప్పటికే అచ్చెన్న ఆరోగ్యం బాగా దెబ్బతింది. మానసికంగా.. శారీరకంగా కూడా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు
సూచించారట. కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉండటమా.. వైసీపీను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావటమా! అనే సందిగ్థతలో అచ్చెన్న ఉన్నట్టు సిక్కోలులో ప్రచారం సాగుతుందన్నమాట.