రాజకీయ చైతన్యం… కుల, మత ప్రభావం. కారణం ఏదైనా ఏపీ లోకల్ ఎన్నికల్లో ప్రజలు మిశ్రమ స్పందన కొత్త ప్రశ్న లేవనెత్తింది. ఇది రేపటి రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేస్తుందనే ఆలోచనకు పునాది వేసింది. ఎన్నిసీట్లు గెలిచినా ఎంతమంది సర్పంచ్ సీట్లు సాధించినా.. ఓవరాల్‌గా అసెంబ్లీ ఎన్నికలే అన్ని పార్టీల టార్గెట్.. సాహోలో ప్రభాస్ అన్నట్టుగా గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో సిక్స్ బాదటమే దమ్ము. నిజమే.. ఎవరికి వారు లోకల్ ఎన్నికల్లో గెలిచిన సీట్లను బలుపుగా భావించి బుట్టలో పడుతున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల మూడు దఫాల విజయాల్లో వైసీపీదే అగ్రస్థానం. ఇది అంత గొప్పగా స్వీకరించాల్సింది కూడా కాదు. ఎందుకంటే.. ఏ రాష్ట్రంలో అయినా.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా లోకల్ ఎలక్షన్స్‌లో అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో అదే అధికసీట్లను గెలుచుకున్నాయి. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే అనుకుంటే చాలు. కానీ..
2024లోనూ ఇవే ఫలితాలని జబ్బలు చరచుకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉన్న మాట నిజమే. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న జనాధరణ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని భావించటం కూడా కాస్త అతిశయోక్తి అనేది విశ్లేషకుల సూచన. బీజేపీ, జనసేన వంటి పార్టీలనూ ఆదరించే అవకాశం ఉందనేది వాళ్లకు పెరిగిన ఓట్లు, సీట్లను బట్టి ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. లోకల్ ఫ్యాక్టర్ పైగా కనీసం కేడర్ లేదంటూ చెబుతున్న జనసేన ఏకంగా 300లకు పైగా సర్పంచ్ స్థానాలు తాము బలపరచిన అభ్యర్థులు గెలుచుకోవటం కాస్త ఊపిరి పోసింది. ఓట్ల శాతం కూడా ఊహించని విధంగా పెరగటం కాస్త ఆలోచించాల్సిన విషయమే. మార్పు కోరుకుంటున్న ఏపీ ప్రజలు వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా జనసేన వైపు చూస్తున్నారా! అనే అనుమానాలకు తావిస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు మొగ్గు చూపితే 2024లో జనసేన బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. లోకల్ ఎలక్షన్స్‌లో టీడీపీ ఓట్లను చీల్చిన జనసేన మున్ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా సొంతం చేసుకుంటే రాబోయే రోజుల్లో
జనసేన ప్రధానమైన పార్టీగా అవతరించే అవకాశాలను కోట్టిపారేయలేని అంశం.



