జగన్ సుప్రీంకోర్టుకు రాసిన లేఖ పై భిన్న వాదనలు. వైసీపీ తరపు నుంచి ఇదంతా సరైనదేనంటూ వకల్తా పుచ్చుకునే వకీలు. అర్రె.. న్యాయవ్యవస్థనే నిలదీస్తారా! రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండి ఇంత విపరీతబుద్దులా అంటూ టీడీపీ తరపున ఉన్న న్యాయకోవిధులు ఖండిస్తున్నారు. ఇంతకీ ఏది నిజం.. ఇంకేది అబద్దం అనేదానిపై సగటు తెలుగు పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు. రాజకీయ చదరంగంలో న్యాయవ్యవస్థలను ఇంత చులకన చేయటం వెనుక అసలు కారణం ఏమిటనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. నిజమే సుమా.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు విపక్ష నేతగా జగన్ అండ్ కో బాబుపై ఏసీబీ, సీబీఐ, హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఫిర్యాదులు చేశారు. బాబుపై చేసిన ఫిర్యాదులు.. పెట్టిన కేసులపై స్టే తెచ్చుకున్న ఆయన స్టే బాబుగా స్ధిరపడ్డారు. ఇదంతా బాబుకు మాత్రమే ఎలా సాధ్యమంటే.. ఇలా సాధ్యమైందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ, హైకోర్టులోని న్యాయమూర్తులు కొందరు బాబు వెనుక ఉండి న్యాయసహాయం చేస్తున్నారంటూ లేఖద్వారా బట్టబయలకు చేశారంటున్నారు వైసీపీ నాయకులు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఏకంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను ఏపీలోకి రానివ్వకుండా జీవోలతో గీతగీశాడు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం హోదాలో జగన్ మోహన్‌రెడ్డి ఆ రేఖను తుడిచి వేశారు. అంటే.. ఆ నాడు బాబుకు భయంగా మారిన దర్యాప్తు సంస్థలకు జగన్ ద్వారాలు తెరిచారు. బాబు అక్రమాస్తులు.. అమరావతి చుట్టూ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఏదోఒక రోజు చంద్రబాబును సీబీఐ విచారించకమానదనేది వైసీపీ గట్టి నమ్మకంగా ఉందనే విషయం దీనిద్వారా తెలుస్తోంది. కాబట్టే.. దానికి ముందుగా సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాల్లో బాబు కు అండగా నిలిచే న్యాయకోవిదులు, న్యాయమూర్తులు ఉండకూడదనేది వైసీపీ సర్కారు ఎత్తుగడ కావచ్చు. దీనికి ఇదే సరైన సమయంగా జగన్ గీసిన స్కెచ్ దాదాపు వర్కవుట్ అయినట్టుగానే వైసీపీ భావిస్తుంది.
అసలే అపర చాణక్య బిరుదాంకితుడు. ముగ్గురు ప్రధానులు.. ఇద్దరు రాష్ట్రపతులను చేయించిన ఘనచరిత్ర గల చంద్రబాబు ఏం చేస్తాడు. బీజేపీతో వైరం.. మిత్రపక్షాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కాపాడే న్యాయనిపుణులు కూడా చిక్కుల్లో పడ్డారు. పీకల్లోతు కష్టాలు.. కనీసం చేయి అందించే సహాయకుడు లేని చంద్రబాబు తనను తాను ఎలా రక్షించుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అనుకూల మీడియాతో జగన్ నువ్వు తప్పు చేశావంటూ భయపెడుతున్నాడు. చూశావా..ఢిల్లీ హైకోర్టు లాయర్ల సంఘం కూడా లేఖ రాసిన జగన్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష ఖాయమంటూ చెబుతుందంటూ హెచ్చరిక చేస్తున్నాడు. నిజానికి అది కోర్టు దిక్కారమా! నిజంగానే కోర్టులపై ఎవ్వరూ నోరెత్తకూడదా! అంటే.. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ కల్పించిన వెసులుబాటులు.. హక్కుల్లో అన్ని వ్యవస్థలూ సమానమే. ముఖ్యంగా పౌరహక్కులకు భంగం కలిగినపుడు.. భారతీయ పౌరులు ఎవరైనా స్వేచ్ఛగా తన వాక్ స్వాతంత్రపు హక్కును ఉపయోగించుకోవచ్చు.
ఇప్పుడు జగన్ చేసింది కూడా అదేనంటారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నప్పటికీ తాను కూడా ఒక సాధారణ పౌరుడుగా ఉండే హక్కులను కాపాడుకోవటం.. వాటికి విఘాతం తలెత్తినపుడు సంరక్షణ వ్యవస్థలను ఆశ్రయించటమే చేశాడంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇదంతా తూచ్.. నేనొప్పుకోనంటున్నారు. ఇలా ఎవరికి ఎవరు స్కెచ్ గీసుకుంటున్నారనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్.