తెలంగాణ బీజేపీ ఎదుగుదలను నిలువరించేందుకు ఏపీలో వ్యూహరచన. తెర వెనుక నుంచి చక్రం తిప్పుతున్న శక్తులు. దీనికి ప్రతిగా సత్తా చాటేందుకు బండి సిద్ధమవుతున్నాడు. ఏపీ స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి బండి సంజయ్ వెళ్తారనే ప్రచారం సాగుతోంది. దీనివల్ల నిస్తేజంగా ఉన్న అక్కడ పార్టీలో జోష్ వస్తుందనే ఆలోచన లేకపోలేదు. నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న కాషాయపార్టీలో సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాక మార్పు వచ్చింది. దీన్ని మరింత పెంచేందుకు బండి సంజయ్‌ను త్వరలో ఏపీలో పర్యటనకు ఆహ్వానించబోతున్నారట.
కరీంనగర్‌లో కార్పోరేటర్‌గా మూడుసార్లు ఓడాడు. ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఊహించని పరాజయం. ఆ తరువాత సంవత్సరం ఏకంగా ఎంపీగా ఘనమైన మెజార్టీ. ఇక్కడ గెలిచినా.. ఓడినా.. కార్యకర్తలు బండి సంజయ్‌ను ఆత్మీయుడుగా భావించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజయ్ ఓడినపుడు అభిమానులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. అదే అభిమానులు సంజయ్‌ను ఎంపీ చేసేంత వరకూ వెన్నంటే ఉన్నారు. ఇదీ సంజయ్ అంటే అనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకూ చేర్చింది. బీజేపీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టేంతటి నమ్మకాన్ని పెంచింది. దుబ్బాక ఉప ఎన్నికలో సారథ్యంతో రఘునందన్‌రావును గెలిపించారు. అదేలా అంటే.. దుబ్బాక నియోజకవర్గంలోని మున్నూరుకాపు, ముదిరాజ్‌లను ఏకతాటిపైకి తీసుకురావటంతో బండి సక్సెస్ అయ్యారు. బండి సంజయ్‌కుమార్ ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన మున్నూరుకాపు వర్గానికి చెందిన నాయకుడు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో మున్నూరు కాపులు చాలా బలమైన వర్గం. గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా పనిచేసిన లక్ష్మణ్ కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన వ్యక్తే. కానీ.. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మణ్ ముగ్గురి సమయంలో హైదరాబాద్, తెలంగాణల్లో నిస్తేజంగా ఉన్న కాషాయ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపలేకపోయారు. కనీసం ధైర్యంగా ఉండలేకపోయారు.
బండి సంజయ్ వచ్చాక ఆ లోటు తీరిందనే అభిప్రాయం కార్యకర్తల్లో కలిగింది. అందర్నీ కలుపుకునే పోయే గుణం ఉన్న బండికి కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇది చాలదన్నట్టుగా. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కుమార్ తోడయ్యాడు. సంజయ్ అన్న నాయకుడు అయితే.. తాను రథసారథినంటూ భుజం కాశాడు. వీరిద్దరి కలయితో రెండు విజయాలు. తెలంగాణలో బీజేపీ బలపడితే.. ఏపీలోని టీడీపీ, వైసీపీలకు దాని తాలూకూ షాక్ తప్పదనేట్టుగా మారింది. వైసీపీతో టీఆర్ ఎస్‌కు దోస్తీ ఉండనే ఉంది. అందుకే.. మొన్న బీజేపీకు జనసేన మద్దతు చెప్పిందనే ఉద్దేశంతో వైసీపీ సైలెంట్ గా ఉండిపోయింది. బీజేపీ బలపడితే వైసీపీపై ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఏపీలోనూ హిందుత్వ భావన పెరిగితే ఇప్పటికే క్రైస్తవులకు అనుకూలంగా ఉంటుందనే వైసీపీ సర్కార్‌కు ఊహించని షాక్ ఎదురయ్యే అవకాశాలున్నాయి. పైగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కాపు వర్గానికి చెందిన నాయకుడే. వీరిద్దరి కలయికతో ఏపీలో హిందు నినాదం మరింత ఊపుఅందుకునే అవకాశాలు లేకపోలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సోము వీర్రాజు ప్రచారం చేసి వెళ్లారు. రేపు స్థానిక ఎన్నికల్లో ఏపీలో బండి సంజయ్ కూడా రంగంలోకి దిగుతారు. ఇది జనసేన, బీజేపీలకు మరింత బలాన్నిస్తుందనేది విశ్లేషకులు అంచనా. కాబట్టే.. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రులు టీఆర్ ఎస్ వెంట ఉన్నారంటూ కొత్త రాగం అందుకుని ప్రచారం చేస్తున్నారు. ఏపీలో బండి సంజయ్ కు ప్రత్యర్థులున్నారని చెప్పటమే వీరి ఉద్దేశంగా కాషాయ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. కానీ.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కలసి పనిచేయాలనే అదిష్ఠానం ఆదేశం. ఈ లెక్కన.. మున్ముందు.. ప్రత్యర్థులకు బండి సంజయ్, సోము వీర్రాజు ఇంకెంతగా చుక్కలు చూపిస్తారనేది వేచిచూడాల్సిందే.