నిన్నటి వరకూ నామినేషన్ వేసే ముందు మాత్రమే నేతలతో గుళ్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు అవే దేవాలయాలు ఆకతాయిల విధ్వంసాలకు.. ఖద్దరు దొరల ప్రమాణాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఇదంతా రాజకీయపార్టీల అంతర్నాటకమా.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అనే అంశంపై పలు అనుమానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి దారుణాలు జరుగుతుంటే పెదవి విప్పేందుకు ఏ పార్టీ నోరు మెదపదు. ఏ ఒక్క నాయకుడూ ముందుకు రాడు. మైనార్టీ ఓట్లు పోతాయనే భయమో.. తమపై హిందు ముద్ర వేస్తారనే గుబులో అర్ధం కాదు. పోనిలే.. ఎవరి పాపం వారిదే అని సర్దుకునే హిందువుల పక్షాన తాము ఉన్నామంటూ నిన్నటి వరకూ భరోసానిచ్చిన బీజేపీ కూడా ఎందుకో మౌనంగా ఉండిపోతుంది. వైసీపీపై నిప్పులు చెరిగి.. చెడుగుడులాడే.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా సైలెంట్ అయ్యారు. ఇదంతా కావాలని చేస్తున్నారా.. లేకపోతే.. వైసీపీ ప్రభుత్వం నుంచి ఏమైనా బెదిరింపులు వచ్చాయా! హైకమాండ్ జర ఆగమంటూ ఏమైనా హుకుం జారీ చేసిందా అనేది సోమన్నకే తెలియాలి.
అంతర్వేదిలో నరసింహస్వామి రథం దగ్థమైంది. ఇది తేనెతుట్టె కోసం ఆకతాయిలు పెట్టిన నిప్పుగా కొట్టిపారేశారు. రాజమండ్రిలో సుబ్రమణ్యం స్వామి విగ్రహం విధ్వసం. మొన్న కృష్ణా.. నిన్న గుంటూరు.. నేడు రాజమండ్రి ఇలా వరుసగా హిందువుల దేవాలయాలపై దాడులు.. సెంటిమెంట్ గా భావించే విగ్రహాల విధ్వంసం. కాషాయ కప్పుకున్న స్వామీజీలు నోరు మెదపరు. ప్రవచనాలు చెబుతూ లక్షలు సంపాదించే గురువులు గమ్మునుంటున్నారు. పోన్లే.. హిందువులంటే.. మా బంధువులంటూ ధైర్యాన్నినింపే బీజేపీ కూడా మౌనంగా ఉంటోంది. ఆరు నెలల క్రితం జబ్బలు చరచి.. హిందువుల్లో మనోధైర్యాన్ని నింపిన హిందు సంఘాలకు అకస్మాత్తుగా ఏమైంది. ఎక్కడేం జరిగినా.. పరమత సహనం అంటూ నోర్మూసుకుని దైవాన్ని ప్రార్థించే హిందువుల్లోనూ ఆందోళన చేపట్టే ధైర్యాన్ని నూరిపోసిన కాషాయపార్టీలు ఏమయ్యాయి. ఏపీ హిందువుల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు. అసలేం జరిగిందనేది సోమన్నే తెలియాలి. ఏపీను కాపాడే బాధ్యతల ఆ ఏడుకొండల వెంకన్నే తీసుకోవాలంటూ హిందువులు ఆ పై వాడిపై భారమేస్తున్నారు.



