ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు రంగం సిద్ధమైంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో సిద్ధమైన కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై-రన్ మొదలుకానుంది. దీనిలో భాగంగా విజయవాడ జీజీహెచ్, తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కాలేజీ, ప్రకాష్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పూర్ణ ఇనిస్టిట్యూట్, ఉప్పులూరు పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యాక్సిన్ కోసం వచ్చేవారు ప్రవేశ మార్గంలో మహిళా పోలీసుకు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ కేంద్రం లోపలికి వెళ్లగానే మూడు గదులు ఉంటాయి. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడోది అబ్జర్వేషన్ గది ఉంటుంది. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యాక్సిన్ డ్రై-రన్ కార్యక్రమం ఇవాళ, రేపు జరుగునుందని స్పష్టంచేశారు.