.గన్నవరం రాజకీయం గరం గరంగా మారింది. వైసీపీ నేతల్లో అంతర్గత వైరం తారాస్థాయికి చేరింది. దీనికి టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర బింధువుగా మారటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. గన్నవరం నియోజకవర్గంలో డాక్టర్ దుట్టా రామచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మిత్రుడు కూడా. సమకాలీకులు కావటంతో కుటుంబంతో అనుబంధం ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలో దుట్టా కొనసాగారు. వైఎస్ మరణం తరువాత ఏర్పడిన పరిణామాలతో దుట్టా.. వైసీపీ పార్టీలోకి చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం నుంచి బరిలోకిత దిగి వల్లభనేని వంశీ చేతిలో ఓడారు. 2019లో యార్లగడ్డ వెంకట్రావుకు పార్టీ టికెట్ ఇప్పించటంలో కీలకంగా వ్యవహరించారు. అన్నీ తానై ప్రచారంలో కూడా పాలుపంచుకున్నారు. ఆ ఎన్నికల్లోనూ గెలిచిన వంశీ.. ఇటీవలే వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో వంశీ వైసీపీ అనధికార నేతగానే చెలామణీ అవుతున్నారు. నియోజకవర్గంలో ఏం జరిగినా వైసీపీ తరపున దుట్టా బాధ్యతలు తీసుకుంటుండేవారు. కానీ.. వంశీ ఎప్పుడైతే వైసీపీ వైప చేరాడో అప్పటి నుంచి వైరం మరింత పెరిగింది. తొమ్మిదేళ్లపాటు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించిన వంశీకే నియోజకవర్గంలో పెద్దపీట వేయటం.. వంశీ కూడా తాను వైసీపీ ఎమ్మెల్యేనే అంటూ తిరగటాన్ని దుట్టా తప్పు బడుతున్నారు. ఇళ్లస్థలాల పంపిణీ విషయంలోనూ వైసీపీ కార్యకర్తలను కాదని.. టీడీపీ వాళ్లకే ప్రయార్టీ ఇస్తున్నారంటూ దుట్టా రెండు నెలల క్రితం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు.
వంశీను తీసుకొచ్చి తమ నెత్తిన రుద్దారంటూ దుట్టా పలమార్లు కార్యకర్తల వద్ద ఆందోళన వ్యక్తంచేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కార్యకర్తల సమావేశంలో వంశీ తీరుపై ఘాటుగానే విమర్శలు కురిపించారు. కొద్దిరోజుల్లో నియోజకవర్గ ప్రజలకు శుభవార్త అంటూ హింట్ ఇచ్చారు. అవసరమైతే.. పార్టీ అధినేత జగన్ ఆదేశిస్తే తాను గన్నవరం నుంచి బరిలోకి దిగుతానంటూ సంచలనం రేకెత్తించారు. వైసీపీలో అంతర్గత పోరుకు కారణమైన ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ పెద్దలు రంగప్రవేశం చేశారట. మరి.. అసలే గరంగరంగా ఉండే గన్నవరం ఎలా చల్లబడుతుందో చూడాల్సిందే!