ఏపీలో అధికారంలో వైసీపీ ఉందా.. టీడీపీ నడిపిస్తుందా! అబ్బే ఇదే డౌటానుమానం. పాతికేళ్లపాటు జగనే సీఎం అని వైసీపీ అంటుంటే ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా! నిజమే.. ఏపీ రాజకీయాలు ఒక పట్టాన అర్ధంకావు. కాంగ్రెస్ అధికారం ఉన్నంత కాలం సీఎం ఎవరంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఉదయాన్నే ఫలానా నాయకుడు సీఎం అంటే.. సాయంత్రమయ్యే సరికే.. హైకమాండ్ ఆ పేరు కొట్టేసి అనామకులను సీఎంలను చేసేవారు. వందేళ్ల పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది. ఏపీలో తాము మినహా ఎవరూ పాలనకు అర్హులు కాదనేది టీడీపీ నేతల అతి ఆత్మవిశ్వాసం. ఆంధ్రప్రదేశ్‌ను తామే ఏలాలనేది కొన్ని వర్గాల ఆకాంక్ష. ఇప్పుడు స్థానిక ఎన్నికల అంశం రచ్చరచ్చగా మారింది. ఇప్పటికే ఏపీలో శాసన,న్యాయ, ఎన్నికల వ్యవస్థల మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. వైసీపీ పాలన చేపట్టి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వివాదం చేయటం.. కోర్టుల ద్వారా ప్రభుత్వ పనితీరును అభాసు పాల్జేయటంపై వైసీపీ నాయకుల కోపానికి కారణం.
తరచూ ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకుల వెనుక టీడీపీ ఉందనే ఆరోపణలతో ఇటీవలే స్వయంగా జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇది శాసన, న్యాయవ్యవస్థల మధ్య పోరుకు వేదికగా మారింది. ఇప్పుడు ఏపీలో స్థానిక ఎన్నికలకు సిద్ధమైన ఎన్నికల కమిషన్ తీరుపై కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తోంది. మార్చిలో ఆగిపోయిన స్థానిక ఎన్నికలను నిర్వహిం చేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సిద్ధమయ్యారు. ఇదంతా టీడీపీ ఆడిస్తుందంటూ వైసీపీ నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ ఏ పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలనే అంశంపై కూడా అధికార పార్టీ, ఎన్నికల సంఘానికి మధ్య సయోధ్యకుదరల్లేదు. నిమ్మగడ్డను ఏపీ ప్రభుత్వం జీవోతో తొలగించటం.. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీకు రుచించలేదు. టీడీపీ మాత్రం ఇది తమకు అనుకూలమనే భావనలో ఉంది.
ఎన్నికల సమీక్షా సమావేశానికి ఎన్నికల కమిషనర్‌ను రమ్మంటూ ఏపీ సీఎంవో నుంచి సందేశం. అంతే తాను హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉండగా ఇలాంటి సందేశాలు పంపటంపై కోర్టుకు వెళ్లానంటూ నిమ్మగడ్డ స్టాంగ్ వార్నింగ్. తనకు తెలియకుండా సమావేశానికి వెళ్లకూడదంటూ వాణీమోహన్‌కు ఆదేశం. అయితే.. దీనిపై వెంటనే స్పందించిన సీఎంఓ కార్యాలయం సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం కొసమెరుపు.
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని.. వైసీపీ. అబ్బే అలాంటిదేమీ లేదు.. బిహార్, తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీకు ఏమైందంటూ టీడీపీ. ఎటూతేల్చుకోలేక. స్వామిభక్తి ప్రదర్శించాలనే తపన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లో ఉందంటూ వైసీపీ మంత్రులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు టీడీపీకు లాభం చేకూర్చేందుకే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ వస్తుందనే సమయంలో ఎన్నికలకు వెళ్లటం ప్రజారోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తుంది. మరి ఈ నెల 28న ఎన్నికల సంఘం జరిపే ఆల్ పార్టీస్ మీటింగ్‌లో ప్రభుత్వం ఎలా స్పందిస్తోందో.. విపక్షాలు దీనికి ఏమని బదులిస్తాయో చూడాల్సిందే.