హైదరాబాద్‌లో పాగా వేయటం రాజకీయంగా కీలకం. దాదాపు 21 అసెంబ్లీ స్థానాల్లో పట్టు సాధించేందుకు బల్దియా మేయర్ పీఠంపై గురిపెట్టడం వెనుక కారణమిదే. 2009లో కనీసం ఒక్కసీటు కూడా గెలవలేమని వెనుకడుగు వేసిన టీఆర్ ఎస్ ఆ తరువాత 2016లో ఏకంగా 99 డివిజన్లు గెలుచుకుంది. అంతకుముందు జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధికారంలోకి రావటం కూడా దీనికి కలసి వచ్చింది. కానీ.. 2020లో పరిస్థితులు మారాయి. వరుసగా మూడేళ్లుగా ఎన్నికల్లో తలపడుతూ వస్తున్న టీఆర్ ఎస్‌కు పోల్ మేనేజ్మెంట్ కొత్తేమీ కాదు. కానీ అనూహ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, వరదసాయంలో కోట్లు పంచినా జనాల్లో వ్యతిరేకత.. ఏడేళ్లపాటు అధికారంలో ఉన్న టీర్ ఎస్ ఏకఛత్రాదిపత్యంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం జనాల్లో నాటుకుపోవటం ఇవన్నీ కేసీఆర్ అండ్ కోటరీపై వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. హరీష్‌రావు, కేటీఆర్ అంటే అపర చాణక్యులు అనే భావనతో మిగిలిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను దూరంగా ఉంచారు. దీంతో వారు కూడా సొంతపార్టీ పట్ల ప్రతికూలంగానే ఉంటూ వస్తున్నారు. ఇవన్నీ 2020 బల్దియా ఎన్నికల్లో బీజేపీ వైపు జనం చూసేలా మార్గం చూపాయి.
ఇది చాలదన్నట్టుగా బండి సంజయ్ అధ్యక్షలతో దుబ్బాకలో సాధించిన విజయం మరింత బూస్ట్ నిచ్చింది. హిందుత్వ నినాదం.. జాతీయత ప్రబోధం అన్నీ బీజేపీ వైపు యువత, మహిళలను ఆకర్షితులను చేశాయి. ఎంఐఎంపై పెల్లుబుకే నిరసనకు ఓటు ద్వారా సమాధానం చెప్పాలనే భావన కూడా జనాల్లో పెరిగింది. పాతబస్తీలో పన్నులు చెల్లించకపోయినా పర్వాలేదంటూ ఎంఐఎం ఎమ్మెల్యే ప్రచారం.. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాదులను కూల్చుతామంటూ అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాలు. కేటీఆర్‌ను చిలుకతో పోల్చినా ధైర్యంగా స్పందించలేని టీఆర్ ఎస్ నాయకత్వ వైఫల్యం ఇవన్నీ ఓటరును బీజేపీ ప్రత్యామ్నాయం అనే భావనకు గురిచేసేలా చేశాయి. అయితే.. బీజేపీ కూడా కనీసం 20 సీట్లు గెలిస్తే చాలు ప్రతిపక్షంతో తాము నిలబడ.. 2023 నాటికి తెలంగాణలో అధికారం సాధించాలనే ఆలోచనలో ఉంది. కానీ.. అనుకోకుండా ఎంఐఎం, టీఆర్ ఎస్ తప్పిదాలకు వరదసాయం అందని ప్రజల వ్యతిరేకత కూడా కమలానికి కలసి వచ్చింది. అందుకే.. 30-40 సీట్లు గెలుస్తామంటున్నారు. ఈ లెక్కన నాలుగేళ్ల వ్యవధిలో బీజేపీ 4 సీట్ల నుంచి 40 సీట్లు రావటాన్ని ప్రచారంగా మలచుకుని రాబోయే రోజుల్లో ఏకంగీ సీఎం పీఠంపై ఫోకస్ చేస్తుంది. ఈ లెక్కన.. బీజేపీ 4 సీట్లను మించి ఒక్కటి ఎక్కువగా గెలిచినా టీఆర్ ఎస్ పునాదులు కదలినట్టుగానే
విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.