బ‌ల్దియా పోరులో కారు వేగానికి కాషాయం బ్రేకు??

వింట‌ర్‌లో గ్రేట‌ర్ హీట్‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జీహెచ్ఎంసీ వాతావ‌ర‌ణం మారింది. బీజేపీ కూడా ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. టీఆర్ ఎస్‌కు కూడా గ‌తానికి భిన్నంగా వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌టంతో స‌వాల్‌గా మారింది. కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంతు కావ‌టంతో బీజేపీకు మ‌రింత క‌ల‌సివ‌చ్చేలా ఉందంటున్నారు విశ్లేష‌కులు. 2016 బ‌ల్దియా ఎన్నిక‌ల్లో మంత్రి కేటీఆర్ ఒక్క‌డే ఒంటిచేత్తో న‌డిపించాడు. 150 డివిజ‌న్ల‌లో 100 డివిజ‌న్లు గెలుస్తామంటూ స‌వాల్ విసిరి మ‌రీ గెలిచి చూపారు. జాంబాగ్‌లో ఎంఐఎం, టీఆర్ ఎస్ హోరా హోరీ పోరులో కేవ‌లం 5 ఓట్ల తేడాతో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఓట‌మి చవిచూసి సెంచ‌రీ మిస్ చేశారంటూ కేటీఆర్ త‌ర‌చూ అంటుంటారు. కానీ.. 2020 అలా లేదు.. ఐపీఎల్ మ్యాచ్‌ను మించిన స‌స్పెన్స్‌తో కొన‌సాగుతున్నాయి.

వాస్త‌వానికి సెప్టెంబ‌రులో కేటీఆర్ మాట్లాడిన‌పుడు టీఆర్ ఎస్ 90కు పైగా సీట్లు సాధిస్తుంద‌న్నారు. త‌మ స‌ర్వేలో కేవ‌లం 21 మంది టీఆర్ ఎస్ సిట్టింగ్ కార్పోరేట‌ర్ల మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని చెప్పుకొచ్చారు. కానీ అక్టోబ‌రులో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో ప్ర‌భుత్వానికి కాస్త ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు మొద‌ల‌య్యాయి. వ‌ర‌ద‌సాయం కింద రూ.500 కోట్లు కేటాయించి బాధిత కుటుంబానికి రూ.10000 సాయం అందించారు. కానీ.. ఆ డ‌బ్బు కాస్త ప‌క్క‌దారి ప‌ట్టాయి. కొంద‌రు కార్పోరేట‌ర్లు, అధికారులు కుమ్మ‌క్క‌వ‌టంతో డ‌బ్బులు అంద‌ని బాధితుల నుంచి వ్య‌తిరేక‌త మొద‌లైంది. అది క్ర‌మంగా కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగా మారింది. అదే స‌మ‌యంలో దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెల‌వ‌టంతో జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా బీజేపీ దూసుకొచ్చింది.

దీనికి త‌గిన‌ట్టుగానే అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సార‌థ్యం బాగా క‌ల‌సివ‌చ్చింది. 10 సీట్లు వ‌స్తే చాల‌నుకున్న బీజేపీ ఇప్పుడు 30-40 స్థానాల్లో గ్యారంటీగా గెలుస్తామ‌నే ధీమాగా ఉంది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ బీజేపీ అభ్య‌ర్థుల ప‌ట్ల ఓట‌ర్లు ఆస‌క్తిచూపుతున్నారు. ఎంఐఎం, టీఆర్ ఎస్ ఒకే జ‌ట్టు అనే భావ‌న హిందు ఓట‌ర్ల మీద ప్ర‌భావం ప‌డుతుంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. ఎంఐఎం బ‌లంగా ఉన్న డివిజ‌న్ల‌లోనూ ఇప్పుడు ఎదురుగాలి త‌ప్ప‌ని ప‌రిస్థితి. కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌తో లాభ‌ప‌డాల‌ని చూసినా ఎక్క‌డో ప‌థ‌కం బెడ‌సికొట్టింది. స‌భ ఆశించినంత‌గా స‌క్సెస్ చేయ‌లేక‌పోయారు. హ‌రీష్‌రావు కూడా ఈ సారి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో క‌నిపించ‌లేదు. కేటీఆర్ ఒక్క‌డు చాలు అనుకున్నా.. తాను కూడా ఎక్క‌డో ప్లానింగ్‌లో వెనుక‌డుగు వేశారు.

కార్పోరేట‌ర్లు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య స‌రైన స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌టంతో.. 2018 ఎన్నిక‌ల్లో కార్పోరేట‌ర్ల నుంచి సాయం అంద‌లేద‌నే కోపం ఎమ్మెల్యేల్లో ఉండ‌టంతో టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌కు మ‌రింత ఇబ్బందిగా మారింద‌ట‌. ఇదే స‌మ‌యంలో యోగి ఆదిత్య‌నాథ్‌, బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి, అమిత్‌షా, న‌డ్డా వంటి బీజేపీ సీనియ‌ర్ల ప‌ర్య‌ట‌న కూడా బీజేపీకు లాభిస్తుంద‌నేది ఆ పార్టీ నేత‌ల న‌మ్మకం. బ‌ల్దియా పీఠం సొంతం చేసుకోకున్నా.. క‌నీసం 30 స్థానాలు గెలుచుకున్నా రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌లకు బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అనే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్ మూడు, నాలుగో స్థానాల‌కు ప‌రిమిత‌మ‌వుతుంది. ఫ‌లితంగా బీజేపీ అనుకున్న‌ది సాధించిన‌ట్ట‌వుతుంది. కారు వేగానికి బండి సంజ‌య్ రూపంలో బ్రేకులు ప‌డిన‌ట్ట‌యింద‌నేది రాజ‌కీయ మేధావుల
అంచ‌నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here