తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీను రక్తపోటు దెబ్బతీసింది. దాదాపు 1995 నుంచి రజనీ అభిమానులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అప్పటికే దిగ్గజ నేతలైన.. కరుణానిధి, జయలలిత రాజకీయంగా కీలకంగా ఉన్నారు. వారిద్దరినీ కాదని.. ఎదురించి కొత్తవాళ్లు రాజకీయ ప్రవేశం చేయటం కూడా సవాల్‌గానే ఉంది. విజయ్‌కాంత్ పార్టీతో లక్‌ను పరీక్షించుకోవాలని చూసినా ఆశించినట్టుగా విజయం దక్కించుకోలేకపోయారు. ఏపీలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీతో దూకుడుగా వచ్చినా వెనుకడుగు వేశారు. ఇవన్నీ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రాకుండా వెనుకడుగు వేసేందుకు కారణమయ్యాయి.
కరుణానిధి, జయలలిత అనారోగ్యంగా మరణించటం.. తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు ఇదే సరైన సమయం అనే భావనతో 2021 ఎన్నికల్లో రజనీకాంత్ కొత్త పార్టీతో సిద్ధమయ్యారు. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యారు. హైదరాబాద్‌లో అన్నాత్తే సినిమా షూటింగ్‌లో ఉండగా సినీ బృందానికి కరోనా పాజిటివ్ రావటంతో సినీ షూటింగ్ వాయిదా పడింది. రజనీకాంత్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ సమయంలోనే రజనీకాంత్‌కు అధిక రక్తపోటు రావటంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్న రజనీకాంత్‌కు బీపీ సమస్య ప్రమాదంగా మారినట్టు వైద్యులు గుర్తించారు. భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు విశ్రాంతి అవసరమని సూచించారు. రెండ్రోజుల క్రితం డిశ్చార్జై ఇంటికెళ్లిన రజనీకాంత్‌ను కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య రాజకీయాల నుంచి వైదొలిగేలా ఒప్పించారు. దీనిపై రజనీకాంత్ కూడా ట్వీట్టర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు వెల్లడించారు. అనారోగ్య సమస్య వల్లనే తాను రాజకీయాలకు దూరమవుతున్నట్టు.. అభిమానులు తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేసినందుకు క్షమించాలంటూ కూడా కోరారు. దీని ప్రభావంతో కమల్‌హాసన్ రాజకీయపార్టీకు ప్రాధాన్యత నెలకొంది. మరి ఇది.. మున్ముందు.. అరవ రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుందటే 2021 ఎన్నికల్లో చూడాల్సిందే.