ఏందిరా సామీ.. ఈ అరవగోల అనటం వింటూనే ఉంటాం. ఎంతైనా మన సోదర రాష్ట్రం కాబట్టి.. తమిళనాడులో జరిగే ప్రతి అంశం మనపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివెనుక.. తెలుగు సినిమా పుట్టుక వెనుక మద్రాసు బీజాలున్నాయి. ఇప్పటికీ సీనియర్‌నటీ, నటులు చెన్నై ఆ చుట్టుపక్కల స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారసులు కూడా అక్కడే స్థిరపడ్డారు. పైగా ఆ నాడు మన ఎన్టీఆర్ సీయంగా ఉన్నపుడు తెలుగు గంగ పేరుతో తంబీలకు తాగునీరు ఇచ్చిన బంధం ఉండనే ఉంది. కాబట్టే. ప్రస్తుతం అక్కడ రాజకీయాలపై ఇంతటి ఆసక్తి.. మొన్న రజనీకాంత్ వస్తున్నాడు.. వచ్చేశాడు… ఇంకేముంది.. వేట సాగించటమే. తలైవా సీఎం అయినట్టే అనుకున్నారు. కానీ.. ఇంతలో పాడు బీపీ రజనీకాంత్ ఆశలపై నీళ్లు చల్లింది. కార్యకర్తలకు బీపీ వచ్చినంత పనిచేసింది. కమల్‌హాసన్ రాజకీయపార్టీ అంటూ ఉన్నా.. దశావతారుడు ఏ రూపంలో ఉంటాడనే నమ్మకం అక్కడ ప్రజల్లో కలిగించలేకపోయారు. ఫలితంగా కమల్ రాజకీయాలను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చనే విశ్లేషణలున్నాయి.
ఇకపోతే.. తమిళనాటు చిన్నమ్మ అంటే తెలియని వారు లేరు. జయలలిత అమ్మ అయితే.. శశికళ చిన్నమ్మ.. ఇద్దరూ ఒకే మాట అనేంతటి బంధం వారిది. కానీ.. జయలలిత ఆకస్మిక మరణంతో రాజకీయాలూ పూర్తిగా మారాయి. అమ్మ అనుచరుడు పన్నీర్‌సెల్వం పగ్గాలు చేపట్టినా.. చిన్నమ్మకు మాత్రం దూరమయ్యాడు. వాస్తవానికి జయలలిత మరణం తరువాత శశికళ సీఎం అనేంతగా ప్రచారం జరిగింది. కానీ.. సీబీఐ కేసులో చిక్కి బెంగళూరులో జైలు జీవితం గడిపారు. తాజాగా ఆమె జైలు నుంచి విడుదల కావటంతో అమ్మ అనుచరుల్లో గుబులు మొదలైంది. ఏఐడీఎంకే అంటే ఇక చిన్నమ్మే అనేంతగా ప్రచారం ఊపందుకుంది . ఈ సారి తమిళనాడు రాజకీయాలను చిన్నమ్మ ప్రభావితం చేస్తారనే ఊహాగానాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే శశికళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడటం మరింత కాక రేకెత్తిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెర వెనుక నుంచి రజనీ మద్దతు ఉంటుందనే అంచనాలు లేకపోలేదు. ఏమైనా.. అరవ రాష్ట్రంలో కొత్త గోల మాంచి రసకందాయంలో పడిందనేది మాత్రం నిజం..!!!!