ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫిర్యాదు. ఇది మా జగన్ అన్న ధైర్యానికి ఉదాహరణ అంటూ వైసీపీ అభిమానులు గొప్పలు చెప్పుకుంటున్నారు. న్యాయనిపుణుల్లోనూ ఈ తరహా ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఇది న్యాయవ్యవస్థకు గొడ్డలిపెట్టుగా చెబుతున్నారు. ఇంకొందరు ఇందులో తప్పేముంది.. ఇప్పటి వరకూ చంద్రబాబు రహస్యంగా తనవారితో కోర్టులకు చేయించిన ఫిర్యాదులే జగన్ మోహన్‌రెడ్డి బహిర్గతం చేసి మరీ ఫిర్యాదు చేశాడంటున్నారు. న్యాయపరమైన అంశాల విషయాల్లో కొన్ని నియమనిబంధనలు, సున్నితమైన అంశాల విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం ఉందనేది న్యాయకోవిదుల అభిప్రాయం.
జగన్ చేసిన ఫిర్యాదు పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అందులో తప్పేమి లేదంటూ అనుకూల వాదులు చెబుతున్నారు. చూశారా.. కోర్టులను కూడా ప్రభుత్వాలు శాసించాలనుకుంటున్నాయంటూ విమర్శలు చేస్తున్నారు ప్రతికూల వాదులు. సీఎం జగన్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఘాటుగానే స్పందించింది. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న అత్యున్నత వ్యక్తులు ఇలా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా చేయటాన్ని తప్పుబట్టారు. ఢిల్లీ బార్ అసోసియేషన్ కూడా జగన్ లేఖను ఖండించింది. కోర్టుదిక్కారంగా దీన్ని భావించాలంటుంది. మరో వైపు జగన్ రాసిన లేఖపై ఓ వ్యక్తి కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 30కు పైగా క్రిమినల్ కేసులున్న నిందితుడు కోర్టులను ప్రభావితం చేయటంగా పిల్‌లో ప్రస్తావించారు.
ఈ నెల 6న జగన్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ఏం చేస్తుంది. నిజంగానే న్యాయమూర్తి రమణ, ఇతరులపై విచారణ చేపడుతుందా! నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన న్యాయవ్యవస్థను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా సుమోటోగా తీసుకుని విచారించనుందా! అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ అవహేళన చేయటం.. తీర్పు గురించి విపరీతంగా స్పందించటంపై సుప్రీంకోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తీవ్రంగా పరిగణించి కోర్టుకు రప్పించి మరీ మొట్టికాయలు వేసింది. దేశంలోని ప్రజల్లోనూ ఇప్పటికీ న్యాయవ్యవస్థపై అపారమైన విశ్వాసం ఉంది. ఇటువంటి సమయంలో అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కేసులు, కోర్టులకు వాయిదాలకు వెళ్తున్న నిందితుడుగా జగన్ సుప్రీంకోర్టుకు లేఖరాయటం ఎంత వరకూ సహేతుకం అనే వాదన కూడా తెరమీదకు వచ్చింది. అయితే.. ఇదంతా కేవలం న్యాయపరిధి వరకు మాత్రమే ఉంటుందా.. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పెను మార్పునకు కారణమవనుందా! అనేది ప్రశ్నార్ధకంగా మార్చేసింది.