ఏపీలో లోకల్ వార్‌కు అడ్డంకులు తొలిగాయి. ప్రభుత్వం పంతం నెగ్గించుకోవాలని చూసినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో దిగిరాక తప్పలేదు. స్థానిక ఎన్నికలు అన్నిపార్టీలకూ సవాల్‌గా మారాయి. రాబోయే ఎన్నికలకు ఇది రిఫరెండంగానే అంచనా వేసుకుంటున్నాయి. వైసీపీ వైపు జనం ఉన్నారంటూ జగన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమను గట్టెక్కిస్తుందని చంద్రబాబు నమ్మకం. మరి బీజేపీ ఇది కేవలం శాంపిల్ ఎన్నికలుగా మాత్రమే చూస్తుంది. కానీ జనసేనకు మాత్రం ఈ ఎన్నికలు చావోరేవో లాంటివి.. పార్టీపరంగా పరవు దక్కించుకోవటం కాదు. బలం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే పార్టీ పరంగా గ్రామస్థాయిలో జనసేన సమావేశాలతో ఎంతోకొంత సమన్వయం చేసుకుంటూ ఓటు బ్యాంకును దరిచేర్చుకునే ప్రయత్నంచేస్తున్నారు. రెండు పార్టీలు కలసి బరిలోకి దిగుతాయంటూ సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ సంయుక్త ప్రకటన కూడా ఇరు పార్టీల మధ్య స్నేహవాతావరణాన్ని పెంచుతాయనేది తెలుస్తోంది
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సభలకు జనం తండోపతండాలుగా వచ్చారు. సేనాని సీఎం కావటం ఖాయమనే అనేంతగా భరోసా పెరిగింది. కానీ.. పవన్ టీడీపీ అనుకూల వాది అంటూ వైసీపీ చేసిన ప్రచారం టీడీపీ వ్యతిరేక ఓటు పవన్‌కు పడకుండా చేయటంలో సఫలమైంది. ఇప్పుడు దాన్ని దాటుకుని ముందడుగు వేయటంలో పవన్ కాస్త బెటరయ్యారు. ఇటీవల వరుస పర్యటనలలో ప్రభుత్వాన్ని చీల్చిచెండాటం.. టీడీపీను కూడా విమర్శించటం ద్వారా తాను తప్పును వేలెత్తి చూపుతానంటూ ప్రజలకు చెప్పటంలో విజయం సాధించారు. పైగా గతానికి భిన్నంగా పవన్ దూకుడు పార్టీ శ్రేణుల్లో ఊపు తెచ్చింది. తనపై అభిమానం ఉన్నా గత ఎన్నికల్లో తనకు ఓటేయలేదంటూ కూడా చెప్పారు. ఆ ఓటు బ్యాంకు వైసీపీకు వెళ్లిందని కూడా చెప్పుకొచ్చారు. పవన్ ఇష్టమని చెప్పే వారు జగన్ పార్టీకు ఓటేయటం నిజమే అనేది అందరూ అంగీకరించే అంశంమే. మరి ఈ లోకల్ వార్‌లో జనసైనికులు పూర్తిగా బీజేపీ, జనసేన బలపరచిన అభ్యర్థులకే ఓటేస్తారనే నమ్మకంగా ఉన్నారు. మరి ఈ నమ్మకాన్ని జనసైనికులు ఎంత వరకూ నిజం చేస్తారనేది చూడాలి. ఏ మాత్రం అంచనాలు తారుమారైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేది పవన్ హెచ్చరిక. మరి జనసైనికులు, మెగా అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో ఎంత వరకూ కలసి పనిచేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.