కాపుల ఓట్లు ఎటు పడతాయి. ఎవరి వైపు ఈ సారి మొగ్గుచూపుతారు. జగన్ వెంట నడుస్తారా? పవన్‌ను అనుసరిస్తారా? ఏపీ స్థానిక ఎన్నికల్లో కాపుల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లో పవన్ ను ఆదరించని కాపులు ఈ సారి తప్పకుండా జనసేనాని వెంట నడుస్తారనే ధీమా కనిపిస్తోంది. బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు కాపు వర్గానికి చెందిన వాడు కావటం.. పవన్ కూడా అదే వర్గానికి చెందటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. 2014 ఎన్నికల్లో కాపులను బీసీల్లోకి చేర్చుతామంటూ చెప్పిన చంద్రబాబు అదే సమయంలో పవన్‌తో ప్రచారం చేయించుకుని గెలిచారు. 2019లో టీడీపీ చేసిన మోసంతో కాపులు పవన్ వైపు అడుగులు వేశారు. కానీ.. టీడీపీతో దోస్తీ ఉన్న పవన్ కాపులకు అన్యాయం చేస్తారంటూ వైసీపీ చేసిన వ్యతిరేక ప్రచారంతో కాపు ఓట్లు వైసీపీ పోలయ్యాయి. ఫలితంగా రెండుచోట్ల పవన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ.. ఏడాదిన్నర వ్యవధిలో కాపులను చిన్నచూపుచూడటం.. టీడీపీ, జనసేన, బీజేపీలోని కాపు నేతలపై కేసులు పెట్టడం.. వేధించటం వంటి ఘటనలు కాపులపై ప్రభావం చూపాయి. ఫలితంగా ఈ సారి పవన్ వెంట నడిచేందుకు కాపులు సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధా, ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య, దాసరి రాము వంటి కాపు నేతలు కూడా పవన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తే మరింతగా ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేన పార్టీకు కులాన్ని ఆపాదించటం ద్వారా ఇతర కులాల ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ సమీకరణ నేపథ్యంలో అందర్నీ కలుపుకుని.. ముందుకు వెళ్లాలనేది జనసేనాని నిర్ణయం. ఈ యుద్ధంలో కాపుగాయటం ద్వారా సేనానికి అండగా నిలవాలనేది కాపు వర్గం ఓటర్ల అభిప్రాయం.