ఏదో జరుగుతోంది.. అయితే ఏమిటనేది అంతుబట్టకుండా ఉంది.. మొన్నా మధ్య ఏపీ డీజీపీ గౌతమ్‌నవాంగ్ విశాఖపట్టణంలో తరచూ పోలీసు యంత్రాంగంతో తరచూ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అదిలాబాద్ జిల్లాలో మకాం వేశారు. అర్ధరాత్రి వేళ మావోయిస్టులకు అడ్డాగా చెప్పబడే తిర్వాణీ ప్రాంతానికి చేరారు. పోలీసులతో మాట్లాడారు. ఎటువంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కొనేలా వారిలో ఆత్మవిశ్వాసం పెంచారు. కొద్దికాలంగా స్తబ్ధుగా ఉన్న మావోయిస్టుల కదలికలు పెరిగాయని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యే, మంత్రులకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలకు మరింత బలాన్ని చేకూర్చేదిగా.. ఇటీవల మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు లొంగిపోతున్నారనే వార్త బయటకు పొక్కింది. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. చికిత్స కోసం జనజీవనస్రవంతిలో కలుస్తారనేది ప్రచారం. ఇదంతా కేవలం పొలీసులు కావాలని చేస్తున్న ప్రచారంగా సీసీఐ మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖలో స్పష్టంచేసింది.
అదిలాబాద్ జిల్లాలో గిరిబిడ్డలను మావోయిస్టులు రిక్రూట్ చేసుకుంటున్నారంటూ జిల్లా ఎస్పీ ఇటీవల వెల్లడించారు. మరోసారి మావోయిస్టులు బలం పుంజుకునేందుకు చాపకిందనీరులా ప్రయత్నిస్తున్నారనేది దీన్ని బట్టి అర్ధమవుతుంది. అదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతోనే డీజీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరంతా ప్రభుత్వానికి లొంగిపోయే అవకాశాలు లేకపోలేదు. మావోయిస్టు పార్టీను నడిపిస్తున్న నేతలంతా దాదాపు 60-70 ఏళ్లు దాటిన వారే ఉన్నారు. వీరంతా సైద్ధాంతిక విబేధాలు, అనారోగ్య కారణాలతో పార్టీకు బారంగా మారారనే ప్రచారమూ ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3700-4000 మంది వరకూ మావోయిస్టులు ఉండవచ్చని గతేడాది గణాంకాల బట్టి అర్ధమవుతోంది. చత్తీస్‌ఘడ్, ఒడిషా, ఏపీ, తెలంగాణ వంటి ప్రాంతాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలు మావోయిస్టుల కార్యకలాపాలకు అనుకూలంగా ఉండటంతో మరోసారి అక్కడే మకాం వేసి కొత్తవాళ్లను రిక్రూట్ చేసుకుంటున్నారనే సమాచారంతోనే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.




సిద్ధాంతాలను నమ్ముకొని ఇన్నేళ్లు పని చేసి ప్రస్తుతం 40 ఏళ్ల లోపు వారిలో కొందరికి నిబద్ధత లోపించి ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు అనుకున్న లక్షం నెరవేరక, ప్రజలలో నమ్మకం సడలి, మద్దతు లేకపోవడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద ఉండటం వంటి కారణాలవల్ల..ఉద్యమ మనుగడ ఉండక పోవచ్చని మేధావుల అభిప్రాయం