రికార్డులు ఆయన ముందు తలొంచుతాయి. కలెక్షన్లు జీ హుజూర్ అంటాయి. బాక్సాఫీసు వద్ద సునామీ.. అభిమానుల గుండెల్లో చెరగని సంతకం. చిరంజీవి.. కేవలం ఒక పేరు కాదు. అదొక ట్రెండ్ సెట్టర్. కోట్లాది మందికి ఇన్స్‌పిరేషన్. ఫ్యాన్స్ కు ఎమోషన్. సాధారణ కానిస్టేబుల్ కుటుంబంలో పెద్దకొడుకుగా పుట్టిన కొణిదల శివశంకర వరప్రసాద్ ఒక్కో మెట్టు ఎక్కుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ సుప్రీం స్థాయికి చేరారు.
1955 అగస్టు 22న మొగల్తూరులో అంజనాదేవి, వెంకటరావు దంపతుల మొదటి సంతానం చిరంజీవి. 8 మంది పిల్లల్లోముగ్గురు చనిపోతే ఐదుగురు మిగిలారు. చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్, విజయదుర్గ, మాదవిరావు. ఇంటికి పెద్ద కొడుకుగా ఎంతో జాగ్రత్తగా మెలిగేవాడు. చిన్న వయసులోనే ఎంతో పరిణితిగా ఉండేవాడు చిరంజీవి అంటూ తల్లి అంజనాదేవి పలుమార్లు చెప్పేది. కూతురు పుట్టి చనిపోతే.. అమ్మను ఓదార్చేందుకు మరో తల్లిగా మారాడంటారామె. ఆ వయసులోనే నా బిడ్డ అంత పరిణితో ఆలోచించటం చాలా ముచ్చటేసిందనేవారు. పెద్ద కుటుంబం.. చాలీచాలని జీతం. తండ్రికి అండగా నిలవాలనే సంకల్పంతో బీఏ వరకూ చదివారు. ఎన్ సీసీలో రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొన్నారు. పోతురాజు వేషంలో అప్పుడు ప్రశంసలు అందుకున్నారు. తండ్రి వెంకటరావులోనూ నటుడు ఉండేవాడు. సినిమాలో నటించాలని ఉన్నా ఉద్యోగం వదలితే కుటుంబం కష్టాల్లో పడుతుందనే భయంతో వెనుకంజ వేశారు. తండ్రి కలను తనయుడు చిరంజీవి నిజం చేశాడు. 1978లో అంటే.. జస్ట్ 23 ఏళ్లకే పునాదిరాళ్లు సినిమాలో నటించటమే కాదు.. రెండో సినిమా ప్రాణంఖరీదులో అవకాశం దక్కించుకున్నారు. బాపూ దర్శకత్వంలో మనవూరి పాండవులు సినిమాలో మురళీమోహన్, కృష్ణంరాజుతో కలసి నటించిన చిరంజీవి కళ్లను చూసిన బాపూ ఎప్పటికైనా చిరంజీవి తెలుగు తెరను ఏలటం ఖాయమంటూ ఆనాడే జోస్యం చెప్పారట.
కష్టపడే గుణం.. నేర్చుకోవాలనే తపన.. చిరంజీవిని మెగాస్టార్ చేసిందంటారు నటుడు కృష్ణంరాజు. ఎవరికీ హాని చేయాలనే ఆలోచన రాని గొప్ప వ్యక్గిత్వం మెగాస్టార్ సొంతం. మురళీమోహన్ మాత్రం చిరు మంచి విలన్‌గా పేరు తెచ్చుకుంటారనే భావించారట. 1980ల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు స్టార్లు వెండితెరపై వెలుగుతున్నారు. అటువంటి సమయంలో సినీరంగంతో పరిచయాల్లేని.. కొణిదెల శివశంకరప్రసాద్ మద్రాసులో కాలుపెట్టారు. మొదట్లో చాలా ఎదురుదెబ్బలు చవిచూశారు. ఈ ముఖానికి హీరోనా అంటూ వెనుక నుంచి కామెంట్స్ వినిపించేవట. అందుకే.. ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు.. పరిచయాలు ఉన్న చోటికి వెళ్లేవారు కాదు. పాజిటివ్ వాతావరణం మనుషులున్న చోటనే ఉండేవారట.
ఇది కథకాదు. మోసగాడు, చండీప్రియ, రాణికాసుల రంగమ్మ వంటి సినిమాల్లో విలన్‌గా చేశారు. శుభలేఖ, రుద్రవీణ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు చిరులోని నటుడిని వెండితెరకు గుర్తు చేశాయి. దర్శకులు కె.విశ్వనాథ్ చాలాసార్లు ఒక మాట అనేవారు. చిరంజీవిలోని సంపూర్ణనటుడిని తెలుగు సినిమా ఉపయోగించుకోలేకపోయిందని.. నిజమే.. కేవలం పాటల, ఫైట్స్ కు మాత్రమే పరిమితమైన చిరంజీవిలోని భిన్నకోణాన్ని చూపింది మాత్రం కె.విశ్వనాథ్ మాత్రమే. దర్శకులు బాలచందర్ అయితే
చిరంజీవి గురించి గొప్పగా ఏం చెప్పారో తెలుసా.. రజనీకాంత్, కమల్‌హాసన్ ఇద్దరూ కలిస్తే చిరంజీవి అని
ఆనాడే చెప్పారట. ఇదంతా రాత్రికి రాత్రే వచ్చింది కాదు.. మెగాస్టార్ కావటానికి డూప్ లేకుండా ఫైట్ చేసిననపుడు కారిన నెత్తురు బొట్లు.. నొప్పులతో నిద్రలేకుండా గడపిన రాత్రులు.. అరకొర భోజనంతో కొనసాగిన రోజులు.. ఇవన్నీ చిరంజీవిని రాటుదేల్చాయి. లక్ష్యం చేరాలని ఉన్నపుడు చుట్టూ ఉన్న ప్రతిబంధకాలను పట్టించుకోకూడదనేవారు. అందాకా ఎందుకు.. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం తాను పాడిన పాటలకు న్యాయం చేసేది ఇద్దరే ఇద్దరనేవారు.. ఒకరు ఎన్టీఆర్ అయితే.. మరొకరు చిరంజీవి. ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే చిరంజీవి మరింత ఉన్నతంగా ఎదగాలంటూ కోరుకునేవారుకూడా.. ఇకపోతే.. వేటూరి సుందర రామ్మూర్తి అయితే.. చిరంజీవి సినిమాకు పాట రాయటాన్ని ఎంజాయ్ చేసేవారట.
చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే అల్లు రామలింగయ్య గమనించారట. దూరపు చుట్టరికం కూడా ఉందని తెలియటంతో ఆరా తీశారు. సినీరంగానిని మకుటంలేని మహారాజుగా ఆనాడే
గుర్తించారు. అలా.. సురేఖతో చిరంజీవి పెళ్లి జరిగింది. హిట్లు.. ప్లాపులు రెండూ చిరంజీవి ఎన్నో చవిచూశారు. ఎవరైనా పొగిడినా.. ఆ రోజు నేలపై పడుకుంటానంటూ చెబుతుంటారు చిరంజీవి.. పొగరు తలకెక్కకుండా నేలమీదనే ఉండాలనే ఉద్దేశమే దీనికి కారణమనేవారు.
రికార్డులు.. ఆయనకేం కొత్తకాదు.. దక్షిణభారతదేశంలో కలెక్షన్లు కురవాలంటే చిరంజీవి సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. సైకిల్ స్టాండ్, క్యాంటీన్ ఓనర్ల నుంచి పంపిణీదారుల వరకూ అందరూ తన సినిమాతో సంతోషంగా ఉండాలని కోరుకునే గొప్పమనసు చిరంజీవిది. 1987లోనే ఆస్కార్ అవార్డులకు ఆహ్వానం అందుకున్న తొలిహీరోగా నిలిచారు. 1992లోనే 1.25 కోట్లు రెమ్యురేషన్ తీసుకుని అమితాబచ్చన్‌ను మించారు. ఘరానా మొగుడు సినిమా ఏకంగా రూ.10కోట్లు కలెక్షన్లతో అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. లగాన్ సినిమాకు అమీర్‌ఖాన్ రూ.6కోట్లు తీసుకుంటే ఇంద్ర సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యునురేషన్ ఎంతో తెలుసా అక్షరాలా రూ.7కోట్లు . ఇంద్ర సినిమా ఏకంగా 30 కోట్లరూపాయలు వసూలు చేయటం అప్పట్లో సినీవర్గాల్లో సంచలనం.
కోట్లు సంపాదించినా తన వాళ్లకు దగ్గరగా ఉండటాన్ని విస్మరించలేదు. రక్తదానం చేయటంపై అపోహలున్న ఆరోజుల్లోనే తన ఫ్యాన్స్‌కు రక్తదాతలుగా మార్చారు. అన్నయ్య ఆదేశంగా భావించిన తమ్ముళ్లు చిరంజీవి బ్లడ్‌బ్యాంకు ద్వారా రక్తం దానం చేస్తూనే ఉన్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు.. 1986-87ల్లోనే పత్తిరైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు
ఆర్ధికసాయం అందజేసారు. ఫిలింపేర్, నందిపురస్కారాలను మించిన తమ్ముళ్ల అభిమానమే తనకు అండ అంటారు. కరోనా విజృంభించిన సమయంలో సీసీసీ ట్రస్ట్ ద్వారా వేలాది మంది సినీ కార్మికుల ఆకలి తీర్చారు. ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అన్నదాతగా మిగిలారు. ఇప్పటికీ ఎవరైనా తన ఇంటి వద్దకు వస్తే… ఆయన చేతిలో కనిపించేది చెక్‌బుక్. ఎందుకంటే..ఆయన మనసు ఆలయశిఖరం… అభిమానుల గుండెల్లో ఖైదీ. సినీ పరిశ్రమకు చిరంజీవి.



